team india

Team India: ఈ పరాభవం కొన్ని తరాలు వెంటాడుతుంది

Team India: సొంతగడ్డపై ఎదురేలేదు. టెస్టు సిరీస్‌ కోల్పోవడం సంగతి పక్కనపెడితే.. అసలు క్లీన్‌స్వీప్‌ అన్నదే లేదు. మూడు దశాబ్దాలకు పైగా సొంతగడ్డపై తిరుగులేని డామినేషన్. బలమైన ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికాలనూ ఓడించిన మన జట్టు అనూహ్యంగా తడబడింది. లంకలో చావుదెబ్బతిని వచ్చిన కివీస్ ఊపిరినిచ్చి తన బేసిక్స్ ను మరచిన టీమిండియా కుదేలైంది. ఈ సిరీస్ రోహిత్.. కోహ్లీ లకు చేదు గుళికగా మారింది.

ప్రత్యర్థి ఎవరైనా సరే.. అందులో ఎంతటి మేటి ఆటగాళ్లు ఉన్నా సరే.. సిరీస్‌ ఆడేందుకు ఒక్కసారి భారత గడ్డపై అడుగుపెట్టారంటే ఓడించి పంపించడమే అలవాటుగా సాగుతున్న టీమ్‌ఇండియాకు ఇది భారీ షాక్‌! 2012లో ఇంగ్లాండ్‌ చేతిలో సిరీస్‌ ఓటమి తర్వాత స్వదేశంలో టీమ్‌ఇండియా తిరుగులేని శక్తిగా ఎదిగింది. అప్పటి నుంచి కివీస్‌తో సిరీస్‌ ముందు వరకూ అన్ని జట్లపై ఆధిపత్యం ప్రదర్శించి అజేయంగా సాగింది. కానీ ఇప్పుడు భారత ఆటగాళ్లు అజేయులు కారని, ఈ జట్టును ఓడించవచ్చని న్యూజిలాండ్‌ నిరూపించింది.స్పిన్‌కు అనుకూలించిన పుణె, వాంఖడేలో మన ప్రదర్శన పాతాళానికి పడిపోయింది. స్వదేశంలో ప్రత్యర్థి జట్లపై పెత్తనం ప్రదర్శించే మన జట్టు టెస్టులను రెండు, మూడు లేదా నాలుగు రోజుల్లో ముగించేది. కానీ ఈ సిరీస్‌లో చివరి రెండు టెస్టుల్లో మాత్రం మూడు రోజుల్లోపే భారత కథ ముగిసింది.

ఇది కూడా చదవండి: Cricket: వైట్ వాష్ అయిన భారత్

Team India: భారత పర్యటన కోసం వచ్చే విదేశీ జట్లు ప్రధానంగా ఇక్కడి స్పిన్నర్లను ఎలా ఎదుర్కోవాలో అని, టీమ్‌ఇండియా బ్యాటర్లకు కళ్లెం వేసేందుకు ఏ స్పిన్నర్లను ఆడించాలో అని ముందే ప్రణాళికలు వేసుకుంటాయి. ఎందుకంటే స్పిన్‌ మన బలం. ఇదే ఆయుధంతో ప్రత్యర్థిని చుట్టేసి, ఆ తర్వాత భారీ పరుగులు సాధించేసి విజయాలు దక్కించుకునేది. కానీ కివీస్‌తో సిరీస్‌లో ఈ వ్యూహం బెడిసికొట్టింది. మన ఉచ్చులో మనమే చిక్కుకున్నాం. తొలి టెస్టులో పేస్‌ పిచ్‌పై దెబ్బతిన్న తర్వాత స్పిన్‌ పిచ్‌లపై ఆడినా ఆట మారలేదు. ప్రత్యర్థి స్పిన్నర్లను ఎదుర్కోలేక మన బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. ఇక్కడ పెద్దగా ఆడిన అనుభవం లేనప్పటికీ రచిన్‌ రవీంద్ర 256 పరుగులు, విల్‌ యంగ్‌ 244 పరుగులు, కాన్వే 227 పరుగులతో  మన స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు.

అందుకే కివీస్ జట్టు టీమిండియాపై పూర్తి ఆధిపత్యం సాధించగలిగింది.  కానీ టీమిండియాలో  పంత్‌  ఒక్కడే 261 పరుగులు చేసి విజయం కోసం పోరాడాడు. ఈ విషయంలో మన టాప్ స్టార్లు…  15.16 సగటుతో 91 పరుగులే చేసిన రోహిత్‌, 15.50 సగటుతో 93 పరుగులే చేసిన  కోహ్లి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. వీళ్లు పరుగులు చేయడంలో కాకుండా త్వరగా పెవిలియన్‌ చేరడంలో పోటీపడ్డారు.  2020 నుంచి స్వదేశంలో స్పిన్నర్ల బౌలింగ్‌లో 39 ఇన్నింగ్స్‌ల్లో 30.40 సగటుతో 821 పరుగులు చేసిన కోహ్లి.. 27 సార్లు ఔటయ్యాడు. ఇక రోహిత్‌ 38 ఇన్నింగ్స్‌ల్లో 35.12 సగటుతో 843 పరుగులు చేశాడు. 24 సార్లు స్పిన్నర్లకు వికెట్‌ సమర్పించుకున్నాడు. ఈ సిరీస్‌లో చూసుకుంటే రెండో టెస్టులో శాంట్నర్‌ కు 12 వికెట్లు , మూడో టెస్టులో ఎజాజ్‌  కు 11 వికెట్లు ఇచ్చారు. అసలు వీళ్ల స్పిన్ బౌలింగ్ ను ఎదుర్కోలేకపోయారు. ఇక పార్ట్‌టైమ్‌ స్పిన్నరైన ఫిలిప్స్‌ 5 ఇన్నింగ్స్‌ల్లో 8 వికెట్లతో భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టాడు. స్పిన్‌ను ఎదుర్కోవడానికి స్వీప్‌ షాట్లు ఆడాలనే విషయాన్ని మన బ్యాటర్లు మర్చిపోవడమే ఈ దుస్థితికి కారణమని మాజీలు అంటున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *