Hyderabad: నగరంలోని గచ్చిబౌలిలో ఉన్న ఇండియన్ స్పెర్మ్ టెక్ కార్యాలయంలో మంగళవారం ఉదయం పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
పోలీసుల కథనం ప్రకారం, సంస్థ యజమాని పంకజ్‌పై గత కొంతకాలంగా ఆరోపణలు వచ్చాయి. డబ్బు ఆశ చూపిస్తూ యువకుల నుంచి వీర్యకణాలు, యువతుల నుంచి అండాలు సేకరిస్తున్నట్టు సమాచారం. ఒక్కసారి వీర్యదానం చేస్తే యువకులకు రూ.5 వేల నుంచి రూ.10 వేలు, అండదానం కోసం యువతులకు రూ.30 వేల నుంచి రూ.50 వేలు ఇస్తామని వాగ్దానం చేసినట్టు తెలిసింది.
ఈ కేంద్రం ద్వారా సేకరించిన వీర్యకణాలు, అండాలను “సృష్టి” వంటి ఇతర ఫెర్టిలిటీ సెంటర్లకు సరఫరా చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. అధికారిక అనుమతులు లేకుండా ఈ కార్యకలాపాలు జరిపినట్టు విచారణలో తేలింది.
సోదాల్లో కార్యాలయం నుంచి పెద్ద ఎత్తున వీర్యకణాలు, అండాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం పంకజ్‌ను అదుపులోకి తీసుకుని మరింత విచారణ చేపట్టారు. ఈ ఘటనపై వైద్య ఆరోగ్య శాఖ కూడా ప్రత్యేక దర్యాప్తు ప్రారంభించినట్టు సమాచారం.