Cricket: టీమిండియా మళ్లీ అదే తడబాటు కనబరిచింది. బెంగళూరు, పునే, ముంబై.. వేదిక మారినా ఫలితం మారలేదు. ఇప్పటికే రెండు ఓటములతో టెస్టు సిరీస్ కోల్పోయిన భారత జట్టు ముంబైలోనూ స్పిన్ అస్త్రానికి కుప్పకూలింది. వరల్డ్ క్లాస్ బ్యాటర్లతో నిండిన భారత్ 147 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక 3-0తో వైట్‌వాష్‌కు గురైంది.స్వల్ప లక్ష్య ఛేదనలో టాపార్డర్ విఫలమైనా రిషభ్ పంత్(64) విధ్వసంక హాఫ్ సెంచరీతో ఆశలు రేపినా.. అజాజ్ పటేల్(6/57) తిప్పేశాడు. వాషింగ్టన్ సుందర్(12)ను బౌల్డ్ చేసి కివీస్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. 25 పరుగుల తేడాతో ఓడి ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ ఆశల్ని సంక్లిష్టం చేసుకుంది.
వాంఖడేలో 2021లో ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు తీసిన అజాజ్ పటేల్ మళ్లీ చెలరేగాడు. తనకు అచ్చొచ్చిన పిచ్ మీద భారత బ్యాటర్లను హడలెత్తించాడు. అనూహ్య టర్న్ లభించడంతో చెలరేగిన అజాజ్ శుభ్‌మన్ గిల్(1) వికెట్‌తో టీమిండియాను ఒత్తిడిలో పడేశాడు. ఆ తర్వాత వరుసగా విరాట్ కోహ్లీ(1), సర్ఫరాజ్ ఖాన్(1)లను పెవిలియన్ పంపి రోహిత్ సేనను ఓటమి అంచుల్లోకి నెట్టాడు.అజాజ్ ధాటికి టాపార్డర్ కుప్పకూలిన వేళ ఓటమి తప్పదా? అనే భయంలో ఉన్న టీమిండియాను రిషభ్ పంత్(64) మరోసారి ఆదుకున్నాడు.
29 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన జట్టుకు ఆపద్భాందవుడిలా మారి.. వీరోచిత అర్ధ శతకం బాదేశాడు. కివీస్ స్పిన్నర్లను దీటుగా ఎదుర్కొన్న పంత్ జట్టును గెలుపు వాకిట నిలిపాడు. పంత్ మెరుపులతో లంచ్ సమయానికి భారత్ 6 వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది.