American Airlines

American Airlines: అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానం టేకాఫ్ సమయంలో అగ్నిప్రమాదం

American Airlines: అమెరికాలోని డెన్వర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం ఓ పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది. టేకాఫ్ అవుతున్న అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానం AA3023 ల్యాండింగ్ గేర్‌లో మంటలు చెలరేగడంతో రన్‌వేపైనే నిలిపివేశారు. ఈ విమానంలో ఉన్న 173 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకురావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

శనివారం మధ్యాహ్నం 2:45 గంటల ప్రాంతంలో (అమెరికా కాలమానం ప్రకారం) బోయింగ్ 737 మాక్స్ విమానం డెన్వర్ నుండి మయామి వైపు రన్‌వే 34L నుండి టేకాఫ్ అవుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. విమానం టైర్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో ల్యాండింగ్ గేర్‌లో మంటలు చెలరేగాయని డెన్వర్ అగ్నిమాపక విభాగం వెల్లడించింది. వెంటనే అప్రమత్తమైన విమాన సిబ్బంది, అత్యవసర ద్వారాలను తెరిచి ప్రయాణికులను బయటకు పంపించారు. భయాందోళనతో కొందరు ప్రయాణికులు అత్యవసర స్లైడ్‌లపైకి జారుతూ బయటకు రాగా, కొందరు తమ లగేజీ, పిల్లలతో సహా కిందకు దిగారు.

ఈ ప్రమాదంలో ఎవరికీ తీవ్ర గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. ఘటన జరిగిన ప్రదేశంలో ఐదుగురిని పరీక్షించగా, వారికి ఆసుపత్రి చికిత్స అవసరం పడలేదు. అయితే, గేట్ వద్ద ఉన్న ఒక వ్యక్తికి స్వల్ప గాయాలు కావడంతో వైద్య చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రయాణికులందరినీ బస్సుల ద్వారా టెర్మినల్‌కు తరలించారు.

Also Read: Meta: 10,000 కోట్ల ఉద్యోగాన్ని వద్దన్న డేనియల్ ఫ్రాన్సిస్: మెటా అంత పెద్ద ఆఫర్ ఎందుకిచ్చింది?

ఈ ఘటనపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) దర్యాప్తు ప్రారంభించింది. విమానం టైర్‌కు సంబంధించిన నిర్వహణ విషయంలో గతంలోనూ హెచ్చరికలు ఉన్నాయని ఎయిర్‌లైన్స్ పేర్కొంది. ఈ ఘటన తర్వాత విమానాన్ని సర్వీస్ నుంచి తొలగించి, పూర్తిస్థాయి దర్యాప్తుకు ఆదేశించారు. అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఈ ఘటన పట్ల ప్రయాణికులకు క్షమాపణలు చెప్పగా, సిబ్బంది సత్వర స్పందనను ప్రశంసించింది. అగ్ని ప్రమాదం కారణంగా రన్‌వేపై కొద్దిసేపు రాకపోకలకు అంతరాయం కలిగింది. విమానాన్ని తొలగించిన తర్వాత సాధారణ కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయి.

ఈ ఘటనతో విమాన ప్రయాణాల భద్రతపై మరోసారి చర్చ మొదలైంది. అయితే, సిబ్బంది సమయస్ఫూర్తి, సత్వర చర్యల కారణంగా పెద్ద ప్రమాదం తప్పి ప్రాణనష్టం జరగలేదు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *