Nagarkurnool: నాగర్‌కర్నూల్ జిల్లాలోని ఉయ్యాలవాడలో ఉన్న మహాత్మా జ్యోతిరావు ఫులే బాలికల గురుకుల పాఠశాలలో నిన్న రాత్రి ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. ఈ ఘటనలో ఏకంగా 64 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఒకేసారి ఇంతమంది విద్యార్థినులు అనారోగ్యం పాలవడం తీవ్ర ఆందోళన కలిగించింది.
ఏం జరిగింది?
శనివారం రాత్రి విద్యార్థినులకు స్నాక్స్‌గా పకోడి అందించారు. ఆ తర్వాత రాత్రి భోజనంలో క్యాబేజీ కూర వేశారు. భోజనం చేసిన కొద్దిసేపటికే సుమారు తొమ్మిది మంది విద్యార్థినులకు కడుపునొప్పి, వాంతులు మొదలయ్యాయి. ఇది గమనించిన పాఠశాల సిబ్బంది వెంటనే వారిని జిల్లా కేంద్రంలోని జనరల్ ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందించారు.
పెరిగిన అస్వస్థుల సంఖ్య
మొదట తొమ్మిది మందితో మొదలైన ఈ సమస్య, క్రమంగా పెరుగుతూ పోయింది. ఆదివారం ఉదయం వరకు అస్వస్థులైన విద్యార్థినుల సంఖ్య 64కు చేరింది. కడుపునొప్పి, వాంతులతో బాధపడుతున్న విద్యార్థినులను 108 అంబులెన్స్‌ల సహాయంతో ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు.
అధికారుల పర్యవేక్షణ
ఈ విషయం తెలుసుకున్న నాగర్‌కర్నూల్ ఆర్డీఓ సురేష్ వెంటనే ఆసుపత్రికి చేరుకున్నారు. అస్వస్థులైన విద్యార్థినులతో మాట్లాడి వారి పరిస్థితిని తెలుసుకున్నారు. వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య సిబ్బందికి సూచించారు.

