Telangana: రైతుల కడగండ్లు తీరడమే లేదు. ఏటికేడు కష్టాల కడలిలో రైతు ఎదురీదుతూనే ఉన్నాడు. ప్రకృతి విలయానికి తోడు సర్కారు నిర్లక్ష్యం రైతులకు తీరని శోకాన్ని మిగిలిస్తున్నాయి. ఇది ఏ ఒక్క ప్రభుత్వమో కాదు.. ఏ ప్రభుత్వమొచ్చినా రైతుల కష్టాలు తీరని వ్యథలుగానే మిగులుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు వరి ధాన్యం, పత్తి నష్టపోయి రైతులు దుఃఖసాగరంలో మునిగిపోయారు.
Telangana: శని, ఆదివారాల్లో కురిసిన వర్షానికి నల్లగొండ జిల్లాలో పలుచోట్ల వరి ధాన్యం తడిసి ముద్దయింది. నాగార్జున సాగర్ నియోజకవర్గం పరిధిలోని గుర్రంపోడు మండలం చామలేడు గ్రామంలోని ఐకేపీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో అమ్మకానికి తెచ్చిన ధాన్యం తడిసిపోయింది. కల్లంలో ఒకవైపు లోతట్టు ఉండటంతో వచ్చిన వరదకు ధాన్యం కొట్టుకుపోయింది.
Telangana: రైతులు చూస్తుండగానే పుట్లకొద్ది ధాన్యం వరదనీటి పాలవుతుంటే పుట్టెడు దుఃఖమే మిగిలింది. అందుకే రైతుల కష్టాలు చెప్పతరం కావని. ఇలాంటి కష్టాలతో సహవాసం చేసేది రైతు ఒక్కడేనని. సకాలంలో ధాన్యం కొనుగోళ్లు చేపట్టి, ఎగుమతి చేసి ఉంటే ధాన్యం తడిసి ఉండేది కాదని బాధిత రైతులు లబోదిబోమంటున్నారు.