Khammam: ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలోని పండితాపురం గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రేమించుకున్న యువతీయువకులు తమ పెళ్లికి పెద్దలు అంగీకరించలేదనే మనస్తాపంతో వేర్వేరుగా ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది.
పండితాపురం గ్రామానికి చెందిన గాడిపల్లి శ్రీకాంత్ (24), బండి హారిక (20) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరూ ఇరుగుపొరుగు ఇళ్లలో నివసిస్తున్నారు. డిగ్రీ పూర్తి చేసిన శ్రీకాంత్ ఆటో ట్రాలీ డ్రైవర్గా పనిచేస్తుండగా, పదో తరగతి తర్వాత చదువు మానేసిన హారిక వ్యవసాయ కూలీ పనులకు వెళ్తోంది. వీరి ప్రేమ వ్యవహారం కుటుంబ సభ్యులకు తెలియడంతో, కులాలు వేరు కావడంతో వారి వివాహానికి పెద్దలు అంగీకరించలేదని తెలుస్తోంది.
Also Read: Murder: తమిళనాడులో దారుణం.. ప్రియుడి కోసం భర్తను హత్య చేయించిన భార్య
పెద్దల నిరాకరణతో తీవ్ర మనస్తాపానికి గురైన హారిక, మంగళవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయం తెలుసుకున్న శ్రీకాంత్ కూడా తీవ్ర ఆవేదన చెంది, గ్రామ సమీపంలోని పంట పొలంలో ఒక చెట్టుకు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
ప్రేమించుకున్న యువతీయువకులు ఇలా ప్రాణాలు తీసుకోవడంతో పండితాపురం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. సమాచారం అందుకున్న కామేపల్లి పోలీసులు వెంటనే గ్రామానికి చేరుకున్నారు. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, యువతీయువకుల ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు చేస్తున్నారు.

