Crime News: విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం మిర్తివలసలో ఓ దుర్ఘటన చోటుచేసుకుంది. సాలూరు పట్టణానికి చెందిన పాలవలస శేఖర్ (వెదురు బుట్టలు, కంచాలు అమ్ముతూ జీవనం) భార్యతో జరిగిన చిన్న గొడవ కారణంగా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
నాలుగేళ్ల క్రితం శేఖర్ ఆదిలక్ష్మిని వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. ఆదివారం సాయంత్రం వ్యాపారం ముగించుకుని ఇంటికి వచ్చిన శేఖర్ భోజనం పెట్టమని భార్యను అడిగాడు. ఆమ్లెట్ కొంచెం మాడిపోవడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కోపంతో ఆదిలక్ష్మి అలిగి తన తల్లి ఇంటికి వెళ్లిపోయింది.
ఇది కూడా చదవండి: National High Ways: తెలంగాణకు గుడ్‌న్యూస్.. 15 హైవేలకు మహర్దశ
భార్య తిరిగి వస్తుందని ఎదురుచూసిన శేఖర్, రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి లోనయ్యాడు. మంగళవారం మధ్యాహ్నం మిర్తివలస గ్రామానికి వెళ్లి పురుగుల మందు తాగాడు. తాను ఈ పని చేసుకున్నట్టు స్నేహితులకు ఫోన్ చేసి చెప్పాడు. స్నేహితులు వెంటనే సాలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినా, చికిత్స పొందుతూ శేఖర్ మృతి చెందాడు.
చిన్న గొడవే ఒక కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

