Cm Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు విజయవాడలో నేడు ఇన్వెస్టోపియా గ్లోబల్-ఏపీ సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సును ఇన్వెస్ట్ ఇండియా మరియు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ (CII) సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యూఏఈకి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, సంస్థల ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటున్నారు. దాదాపు 200 మంది యూఏఈ ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు.
సదస్సుకు హాజరైన ప్రముఖులు
ఈ సదస్సుకు అనేక అంతర్జాతీయ ప్రముఖులు ఇప్పటికే విజయవాడ చేరుకున్నారు. ఇన్వెస్టోపియా సీఈవో డాక్టర్ జీన్ ఫేర్స్, సీఐఐ వైస్ ప్రెసిడెంట్, భారత్ బయోటెక్ ఎండీ డాక్టర్ సుచిత్ర కె. ఎల్ల, లులు ఇంటర్నేషనల్ సీఎండీ యూసుఫ్ అలీ, టాటా కెమికల్స్ ఎండీ, సీఈవో ముకుందన్, యూఏఈ ఆర్థిక, పర్యాటక మంత్రి హెచ్.ఈ అబ్దుల్లా బిన్ టౌక్ అల్‌మరి వంటి ప్రముఖులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు.
నాలుగు కీలక చర్చల అంశాలు
ఈ సదస్సులో ప్రధానంగా నాలుగు ముఖ్యమైన అంశాలపై చర్చ జరగనుంది.
-
భారత్ – యూఏఈ ఆర్థిక సంబంధాలు బలోపేతం చేయడం, పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్‌ను ప్రధాన ద్వారంగా మార్చే ప్రణాళికలపై చర్చ.
-
యూఏఈ – ఏపీ భాగస్వామ్యం ద్వారా వ్యాపార విస్తరణ, పెట్టుబడి రంగాల అభివృద్ధి, ఉత్తమ విధానాలపై ప్యానెల్ చర్చ.
-
ఇండో-యూఏఈ ఫుడ్ కారిడార్ కింద వ్యవసాయ సాంకేతికత, ఫుడ్ పార్కులు, సప్లై చైన్ బలోపేతం, ఎగుమతులు పెంపు, ఆహార భద్రత వంటి అంశాలపై చర్చ.
-
సాంకేతికత సాయం అంశంలో ఏఐ, డేటా సెంటర్లు, స్మార్ట్ గవర్నెన్స్ ఆర్థిక వృద్ధిలో చేసే పాత్రపై చర్చ జరగనుంది.
ఇది కూడా చదవండి: Pulasa: మత్స్యకారుల పంట పండింది..2 కిలోల పులసకు రూ.26వేలు…
హరిత ఇంధనంలో క్రోమా అథోర్ ఆసక్తి
హరిత ఇంధన రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు యూఏఈకి చెందిన క్రోమా అథోర్ ఇంటర్నేషనల్ సంస్థ ఆసక్తి వ్యక్తం చేసింది. కంప్రెస్డ్ బయో గ్యాస్, సోలార్ సెల్ తయారీ యూనిట్ల ద్వారా పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉందని సీఎం చంద్రబాబుకు లేఖ రాసింది.
ఏపీలో పెట్టుబడులకై ముఖ్య ముందడుగు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేసేందుకు ఈ సదస్సు ముఖ్య పాత్ర పోషించనుంది. యూఏఈతో బలమైన వ్యాపార, ఆర్థిక సంబంధాలు నెలకొల్పేందుకు ఈ సమావేశం కీలక మైలురాయిగా భావిస్తున్నారు.

