Mahesh Kumar Goud: టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ మాజీ మంత్రి హరీశ్ రావుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, హరీష్ రావు వాదనల్లో అసలు పసలేదని, అర్థం లేని మాటలతో తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మహేశ్ కుమార్ గౌడ్ మండిపడ్డారు.
అర అంగుళం మెదడు పెరగలేదు– మహేశ్ గౌడ్ సెటైర్
“హరీష్ రావు ఆరు అడుగులు పెరిగాడే తప్ప అర అంగుళం మెదడు పెంచుకోలేదు” అని మహేశ్ గౌడ్ కఠిన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో జరిగిన నీటి పారుదల మీటింగ్‌లో ఏం చర్చించారో కేంద్ర మంత్రి సీ.ఆర్ పాటిల్ స్పష్టంగా చెప్పారని, సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రెస్ మీట్ పెట్టి వివరించారని చెప్పారు. అయినా హరీష్ రావు అడ్డగోలు వాదనలతో పిచ్చి ప్రేలాపనలు చేస్తూ, ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
రాష్ట్ర ప్రయోజనాల కంటే వ్యక్తిగత ఉనికే ముఖ్యం
హరీష్ రావు రాష్ట్ర ప్రయోజనాల కంటే తన ఉనికిని చాటుకోవడానికే ప్రయత్నిస్తున్నారని మహేశ్ గౌడ్ విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌కు సవాల్ విసిరారని గుర్తు చేశారు. “అసెంబ్లీకి వచ్చి చర్చల్లో పాల్గొనండి లేదా మేమే ఫామ్ హౌస్‌కి వచ్చి మాక్ అసెంబ్లీ పెడతాము, పాల్గొనండి” అని సవాల్ విసిరినా, కేసీఆర్, హరీష్ రావు స్పందించలేదన్నారు.
ఇది కూడా చదవండి: Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి బిగ్ షాక్.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
తెలంగాణకు ద్రోహం చేసిన వారు ఆరోపణలు చేయడం సిగ్గుచేటు
గోదావరిలో 3 వేల టీఎంసీల నీరు ఉన్నా, ఆంధ్రా ప్రాజెక్టులు కట్టుకున్నా సమస్య లేదని మహేశ్ గౌడ్ స్పష్టం చేశారు. “రాయలసీమను రతనాల సీమ చేస్తాను, బేసిన్లు లేవు, భేషజాలు లేవు” అని కేసీఆర్ చెప్పినందుకే ఈ రోజు బనకచర్ల, రాయలసీమ ఎత్తిపోతల పథకాలు కడుతున్నారని గుర్తు చేశారు. తెలంగాణకు ద్రోహం చేసిన వారే ఇప్పుడు కాంగ్రెస్, సీఎం రేవంత్ రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటని అన్నారు.
మీకు దమ్ముంటే అసెంబ్లీలోకి రండి
మీకు దమ్ముంటే అసెంబ్లీలో చర్చలకు రండి, మీ వాదనలు చెప్పండి. ప్రెస్ మీట్లు పెట్టి కోడిగుడ్డు మీద ఈకలు పీకుదామని చూస్తే జనం నమ్మరు అని మహేశ్ గౌడ్ సవాల్ విసిరారు.

