Pawan Plan Success: కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న జనసేన…. అధినేత పవన్ కల్యాణ్ నాయకత్వంలో వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. గ్రామీణ, గిరిజన ఓటు బ్యాంకును లక్ష్యంగా చేసుకుని, వైసీపీ సంప్రదాయ ఓట్లను కూటమి వైపు మళ్లించేందుకు పవన్ ప్రయత్నిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం, జల్ జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికీ తాగునీరు, మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించారు పవన్. కేంద్రం నుంచి నిధులు తెప్పించి, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నారు. ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు గ్రామాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందేగా. వారంతా పవన్ వ్యూహం ఫలితాలను స్వయంగా గమనిస్తున్నారట. గ్రామీణ ఓటర్లు కూటమి వైపు మొగ్గుతున్నారని, వైసీపీ పట్టు సడలుతోందని చర్చించుకుంటున్నారట.
సంప్రదాయ ఓటు బ్యాంకు రాజకీయ పార్టీల మనుగడకు కీలకం. వైసీపీ 2024 ఎన్నికల్లో ఓడినప్పటికీ సుమారు 40 శాతం ఓట్లను రాబట్టగలిగింది అంటే అది ఆ పార్టీకున్న సంప్రదాయ ఓటు బ్యాంకు బలమే. ఇంకా తన ఓటు బ్యాంకు పదిలంగానే ఉందని జగన్ భావిస్తున్నారు. అందుకే తాను ఏం చేసినా నడుస్తుందని నమ్ముతున్నారు. తనకు నచ్చింది చేసుకుంటూ వెళ్తున్నారు. కానీ జగన్ ఆయువు పట్టు లాంటి సాంప్రదాయ ఓటు బ్యాంకుకు చాప కింద నీరుగా పవన్ చిల్లు పెడుతున్నాడని పరిశీలకులు అంటున్నారు. జగన్ తమకు ఏమీ చేయకున్నా సరే, వివిధ కారణాలు, వైఎస్ ముద్ర వల్ల, ఏర్పరుచుకున్న అభిమానం వల్ల.. ఇంకా జగన్‌నే అంటిపెట్టుకుని ఉన్నారు వైసీపీ సాంప్రదాయ ఓటర్లు. అయితే పవన్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రయ్యాక.. జనసేన జగన్ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు వ్యూహాత్మకంగా పనిచేసుకుంటూ వస్తోంది.
Also Read: Mahaa News: పల్లె బాట కు సిద్ధమవుతున్న మహా న్యూస్ ..
ముఖ్యంగా గిరిజన నియోజకవర్గాల్లో 2014, 2019లో వైసీపీ ఆధిపత్యం చెలాయించగా, 2024లో కూటమి సత్తా చాటింది. ఇప్పుడు గిరిజన ప్రాంతాల్లో రహదారులు, మౌలిక వసతుల కల్పనతో పాటు, పవన్ వ్యక్తిగతంగా సంబంధాలు పెంచుకుంటూ ఈ ఓటు బ్యాంకును బలోపేతం చేస్తున్నారు. జగన్ ఏనాడు తమ కోసం రాలేదని, వచ్చినా రాకున్నా, తమ సమస్యల్ని తీర్చినా తీర్చకున్నా.. జగన్‌నే గెలిపించుకుంటూ వచ్చామని.. కానీ, దేవుడిలా పవన్ తమ గ్రామాలకు మేలు చేస్తున్నారనీ, తమలో ఒకడిలా కలిసిపోయారనీ, ఎవరు ఉన్నా లేకున్నా తమకు పవన్ ఉన్నారని, ఆపదలో అండగా ఉంటారన్న నమ్మకం ఉందని, మార్పు దిశగా ఆలోచించడం మొదలు పెట్టారట గిరిజన ప్రాంతాల గ్రామీణ ఓటర్లు. ఈ మార్పును.. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ద్వారా… ఇంటింటికీ వెళ్తున్న ప్రజా ప్రతినిధులు స్వయంగా అనుభూతి చెందడం గమనార్హం.
వైసీపీ హయాంలో సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడంతో అభివృద్ధి వెనుకబడిందన్న విమర్శ గ్రామీణ ప్రాంతాల్లో ఉండేది. ఈ అంశాన్ని పవన్ తన వ్యూహంలో భాగం చేసుకుని, అభివృద్ధి పనుల ద్వారా ప్రజల మనసు గెలుస్తున్నారు. గ్రామీణాంధ్రలో జనసేన సొంత క్యాడర్‌ను ఏర్పాటు చేసుకోవడంతో పాటు, కూటమి అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు ఈ ప్రయత్నాలు ఫలిస్తున్నాయంటున్నారు విశ్లేషకులు. పవన్ వ్యూహం గట్టిగా వర్కవుట్ అవుతోందని వారు అభిప్రాయపడుతున్నారు.