Komatireddy Venkatreddy: ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సి.ఆర్. పాటిల్ అధ్యక్షతన ఈరోజు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య కీలక సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
బనకచర్ల ప్రాజెక్టును తెలంగాణ ఒప్పుకునే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. గోదావరి-బనకచర్ల ప్రాజెక్టును ఒక్క ఎజెండాగా ఉంచితే, ఆ సమావేశానికి హాజరుకాలేమని కేంద్రానికి తెలంగాణ ఇప్పటికే తెలియజేసిందన్నారు.
అలాగే, గతంలో తెలంగాణకు చెందే కృష్ణా నదీ జలాలను మాజీ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, జగన్‌మోహన్ రెడ్డి అక్రమంగా తరలించుకున్నారని ఆరోపించారు. ఇక భవిష్యత్తులో మహారాష్ట్రలోని నాసిక్ వద్ద గోదావరి పై డ్యామ్ నిర్మిస్తే, తెలంగాణ మొత్తం ఎండిపోతుందని హెచ్చరించారు.
కాళేశ్వరం ప్రాజెక్టును ‘దేశంలోనే ఒక వింత’గా పేర్కొన్న మంత్రి, అది పూర్తిగా కూలిపోతే ‘ప్రపంచంలో వింత’ అవుతుందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. మేడిగడ్డ బ్యారేజీ పూర్తిగా కూలిపోతుందని ఎన్డీఎస్ఏ ఇప్పటికే నివేదికలో పేర్కొనిందని తెలిపారు.
ఇక రహదారి ప్రాజెక్టుల విషయానికి వస్తే — ఉప్పల్ ఫ్లైఓవర్ పనులను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి నారపల్లి వరకు 8 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న ఫ్లైఓవర్ పనులు వేగంగా కొనసాగుతున్నాయని వెల్లడించారు.
సుమారు 8 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ ప్రాజెక్టు ఆర్థిక కారణాలతో జాప్యం చెందిందని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పనులకు ప్రాధాన్యం ఇచ్చామని తెలిపారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో చర్చించి కాంట్రాక్టరును మార్చి కొత్త సంస్థకు పనులు అప్పగించామని చెప్పారు. త్వరితగతిన పనులు పూర్తిచేస్తూ వచ్చే దసరా నాటికి ఫ్లైఓవర్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు.