Jubilee Hills Danam: జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుండి బిఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ 2023 ఎన్నికల్లో గెలిచారు. ఆయన ఇటీవల అనారోగ్యం కారణంగా మృతి చెందటంతో జూబ్లీహిల్స్లో ఉపఎన్నిక అనివార్యమైంది. నోటిఫికేషన్ కూడా తొందరలోనే వచ్చే అవకాశం ఉంది. దీంతో ఈ ఉపఎన్నికను అన్ని పార్టీలు సీరియస్గా తీసుకుంటున్నాయి. సిట్టింగ్ స్థానం కావడంలో ఎలాగైనా గెలువాలని బీఆర్ఎస్ చూస్తుంటే… మరోవైపు బీజేపీ సైతం ఉప ఎన్నికను ప్రతిష్టత్మాకంగా తీసుకుంటోంది. అధికార పార్టీ కాంగ్రెస్ సైతం జూబ్లీహిల్స్ ఎన్నికలో గెలిచి గ్రేటర్లో పార్టీకి బూస్టప్ ఇవ్వాలని, అలాగే రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా జోష్ నింపిన్నట్లు ఉంటుందని భావిస్తోంది. ఇలా ఎవరికి వారు గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు.
అయితే అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి నేను సైతం పోటీలో ఉన్నాను అంటున్నారు ఆ ఎమ్మెల్యే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటగా పార్టీ మారి, హస్తం గూటికి చేరిన నేత ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. హైదరాబాద్లో తనకంటూ ఒక మాస్ ఇమేజ్ ఉన్న నాయకుడు అతను. బీఆర్ఎస్లో ఎమ్మెల్యేగా గెలిచి, కాంగ్రెస్ గూటికి చేరడమే కాకుండా.. సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు దానం నాగేందర్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో మరోసారి దానం నాగేందర్ పేరు చర్చకు వస్తోంది. ఇప్పటికే ఢీల్లీకి వెళ్లి పార్టీ పెద్దలను కూడా కలిసినట్టు సమాచారం. అయితే ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా రాజీనామా చేసి, జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో పోటీ చేసి గెలిచి, మంత్రి పదవి కైవసం చేసుకోవడంతోపాటూ… పార్టీ ఫిరాయింపుల కేసుకి చెక్ పెట్టాలన్నది ఆయన ఆలోచనగా తెలుస్తోంది. అంటే ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నమాట.
Also Read: Mega 157: మెగా157 జోరు.. కేరళలో క్రేజీ సాంగ్?
ఇదిలా ఉంటే ఇప్పటికే… తానే ఉప ఎన్నిక అభ్యర్థినంటూ 2023 ఎన్నికలో పోటీ చేసిన అజారుద్దీన్ ప్రకటించుకున్నారు. మరోవైపు మేము భరిలో ఉన్నామని మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, నవీన్ యాదవ్ అంటుంటే… మైనారిటీ వర్గం నుండి ఫహీం ఖురేషి, ఏఐసీసీ కోఆర్డినేటర్ నుమాన్ సైతం మేము కూడా రేసులో ఉన్నామని అంటున్నారు. అయితే పీసీసీ అధికారికంగా ఎవరి పేర్లు ప్రకటించకపోయినా తాము రేసులో ఉన్నామని చెప్పుకొని వస్తున్నారు. ఎవరు ఎన్ని చేసినా.. ఎంత చర్చ జరిగినా… చివరికి అధిష్టానమే అభ్యర్థిని ప్రకటిస్తుందని… దానికి కావాల్సిన సర్వే, ఎలక్షన్ కమిటీ ఉంటుందని గాంధీ భవన్ వర్గాలు చెప్పుకొస్తున్నాయి.
ఒకవేళ దానం ఉప ఎన్నికలో పోటీ చేసి గెలిస్తే సరే. ఓడిపోతే పరిస్థితి ఏంటి? దానం ఇంత రిస్క్ చేస్తాడా…! ఓడితే పార్టీ పరంగా కాంగ్రెస్ అవకాశం ఇస్తుందా..! ఒకవేళ సర్వే దానంకి అనుకూలంగా వచ్చి టికెట్ ఇస్తే ఉప ఎన్నికలో టికెట్ ఆశిస్తున్న వారు సహకరిస్తారా…? ఇలా ఎన్నోఅంశాలు పార్టీలో చర్చకు వస్తున్నాయి. ఉప ఎన్నికకు ఇంకా సమయం ఉంది కాబట్టి మరింత కసరత్తు చేయాలని భావిస్తోంది హస్తం పార్టీ. మరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అధికార పార్టీ ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్తుందో చూడాలి.