Pawan Kalyan: విద్య, ఉద్యోగం, వ్యాపార అవకాశాల కోసం భాషతో సంబంధం లేకుండా ముందుకు వెళ్తున్న ఈ రోజుల్లో హిందీ భాషను గుడ్డిగా వ్యతిరేకించడం సరికాదని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. అలా చేయడం భవిష్యత్ తరాల అభివృద్ధికి అడ్డంకి అవుతుందని ఆయన స్పష్టం చేశారు. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో శుక్రవారం జరిగిన రాజ్య భాషా విభాగం గోల్డెన్ జూబ్లీ వేడుకలకు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరై ఈ వ్యాఖ్యలు చేశారు.
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, “హిందీలో డబ్ అయిన 31 శాతం దక్షిణాది సినిమాలు మంచి ఆదాయాన్ని సంపాదిస్తున్నాయి. వ్యాపారానికి హిందీ కావాలి, కానీ నేర్చుకోవడానికి ఎందుకు ఇబ్బంది?” అని ప్రశ్నించారు. హిందీ నేర్చుకోవడం అంటే మన అస్తిత్వాన్ని కోల్పోవడం కాదని, ఓడిపోవడం అంతకంటే కాదని ఆయన అన్నారు. ఒక కొత్త భాషను అంగీకరించడం అనేది అందరితో కలిసి ప్రయాణించడమే అవుతుందని ఆయన వివరించారు.
Also Read: Indira canteen: ఇందిరమ్మ క్యాంటీన్లలో ఆరోగ్యకర అల్పాహారం… కేవలం రూ.5కే!
సాధారణంగా తమిళనాడు, కర్ణాటక వంటి దక్షిణాది రాష్ట్రాలు హిందీ భాషను తీవ్రంగా వ్యతిరేకిస్తాయి. అయితే, తెలుగు రాష్ట్రాల్లో హిందీ పట్ల అంత వ్యతిరేకత కనిపించదు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
ఈ గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో భాగంగా ‘దక్షిణ సంవాదం’ పేరుతో ఒక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వంటి ప్రముఖులు పాల్గొన్నారు. భాష అనేది ఒక వంతెన లాంటిదని, అది అవకాశాలను సృష్టిస్తుందని పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో నొక్కి చెప్పారు.

