Mega PTM 2.0 Lokesh: జూలై 10, 2025, గురుపౌర్ణమి రోజు ఆంధ్రప్రదేశ్ విద్యారంగంలో ఓ పండగ వాతావరణం నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా రెండు కోట్ల మంది తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఒకే వేదికపై సమావేశమైన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 2.0 ఒక చారిత్రక ఘట్టంగా నిలిచింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం, ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్ల స్థాయికి చేర్చాలన్న లోకేష్ విజన్‌కు అద్దం పట్టింది. గత ఏడాది భారీ విజయం సాధించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్, ఈసారి మరింత విస్తృతంగా, అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో నిర్వహించబడింది.
ఈ సమావేశాల లక్ష్యం విద్యార్థుల అభివృద్ధికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఇతర స్టేక్హోల్డర్ల మధ్య సమన్వయాన్ని పెంచడం. విద్యార్థుల పురోగతి, మెరుగుపరచాల్సిన అంశాలు, పాఠశాలల విద్యా పనితీరు, మౌలిక సదుపాయాలు, భవిష్యత్తు ప్రణాళికలపై చర్చలు జరిగాయి. ఆరోగ్య పరీక్షలు, హెల్త్ బుక్లెట్ల పంపిణీ, ఫ్యామిలీ ఫోటో బూత్‌లు, డ్రీమ్ వాల్స్, పాజిటివ్ పేరెంటింగ్ సెషన్స్, ‘ఒక చెట్టు-అమ్మ పేరిట’ వంటి కార్యక్రమాలు ఈ సమావేశాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమం గిన్నిస్ రికార్డు సృష్టించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
శ్రీసత్యసాయి జిల్లా కొత్తచెరువు జిల్లా పరిషత్ పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఉపాధ్యాయుడి రోల్లో మెరిశారు. తరగతి గదిలో ‘వనరులు’ అనే అంశంపై విద్యార్థులకు బోధించారు, వారి నుంచి సమాధానాలు రాబట్టారు. లోకేష్ విద్యార్థులతో కలిసి కూర్చొని, చంద్రబాబు పాఠాలను శ్రద్ధగా ఆలకించారు. “లోకేష్ చదువుకునే రోజుల్లో నేను ఎప్పుడూ పీటీఎంకు వెళ్లలేదు. కానీ, లోకేష్ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక, ఈ సమావేశాలకు రావాల్సి వస్తోంది” అంటూ చమత్కరించారు సీఎం చంద్రబాబు.
Also Read: Mohan Bhagwat: రాజకీయ నాయకుల రిటైర్మెంట్పై మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
Mega PTM 2.0 Lokesh: లోకేష్ విజన్‌లో విద్యారంగంలో సంస్కరణలు ఊపందుకున్నాయి. జూన్ 12 నుంచి విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతోనే 12 వస్తువులతో కూడిన కిట్లు విద్యార్థులకు అందాయి. సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం, ‘తల్లికి వందనం’ పథకం కింద తల్లుల ఖాతాల్లో 13 వేల రూపాయలు జమ చేయడం వంటి చర్యలు ప్రభుత్వ విద్యను బలోపేతం చేశాయి. ఈ రోజు తల్లికి వందనం రెండో విడత నిధులు కూడా జమయ్యాయి. ఈ సందర్భంలో లోకేష్, పవన్ కళ్యాణ్ మధ్య సోదర బంధం మరోసారి బయటపడింది. ‘అమ్మ పేరిట – ఒక మొక్క’ అనే కార్యక్రమానికి ఇటీవల పిలుపునిచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ. దీనిని సవాల్‌గా స్వీకరించి రాష్ట్రంలో కోటి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. “పవనన్న సవాల్‌ని సింగిల్‌గా స్వీకరిస్తున్నా” అంటూ ప్రకటించారు నేడు నారా లోకేష్. తన విద్యాశాఖ ద్వారా కోటి మొక్కలు నాటుతామని, విద్యార్థులకు ప్రకృతి పట్ల బాధ్యతని పెంచే కార్యక్రమంగా దీనిని చేపడతామని పేర్కొన్నారు. మొక్కనాటి దానిని సంరక్షించిన ప్రతి విద్యార్థికి “గ్రీన్ పాస్‌పోర్ట్” అనే కాన్సెప్ట్‌తో ధృవీకరణ పత్రం కూడా అందజేస్తామని తెలిపారు. పవన్ కళ్యాణ్ సవాల్‌కి నారా లోకేష్ స్పందన.. కూటమి పార్టీల మధ్య ఆరోగ్యకరమైన పోటీ తత్వాన్ని మరోసారి చాటినట్లయింది.
మెగా పీటీఎం 2.0 విద్యారంగంలో సంస్కరణలు, సామాజిక బాధ్యతలను ఒకే వేదికపై సమన్వయం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొన్న ఈ కార్యక్రమం, విద్యలో విప్లవాత్మక మార్పులకు బీజం వేసింది. విద్యా వ్యవస్థని ప్రక్షాళనం చేసేస్తామని చెప్పిన జగన్ ఏనాడూ ఈ విధంగా అందరితో ముఖాముఖీ సమావేశం కాలేదు. అయిష్టంగా విద్యాశాఖని చేపట్టిన బొత్స సత్యనారాయణ కూడా ఏనాడూ ప్రభుత్వ పాఠశాలలని సందర్శించలేదు. కానీ ఇప్పుడు సాక్షాత్ సిఎం చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయులు, విద్యార్ధులు, తల్లితండ్రులతో మాట్లాడుతున్నారు. సంస్కరణలంటే బైజూస్ ఆన్లైన్ పాఠాలు, ఇంగ్లీష్ మీడియం చదువులు కావు. విద్యార్థులకు నిజంగా కావాల్సింది లోకేష్ అమలు చేస్తున్న సంస్కరణలే అంటున్నారు విశ్లేషకులు.