Shubman Gill: ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను ఓడించి టీమ్ ఇండియా చరిత్ర సృష్టించింది. 58 ఏళ్ల చరిత్రలో ఎడ్జ్‌బాస్టన్‌లో భారత్ సాధించిన తొలి టెస్ట్ విజయం ఇది. శుభ్ మాన్ గిల్ నేతృత్వంలోని భారత జట్టు రెండో టెస్ట్ మ్యాచ్ చివరి రోజున ఇంగ్లాండ్‌ను 336 పరుగుల తేడాతో ఓడించింది. దీనితో, భారత్ 5 మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. భారత్ తరఫున ఈ విజయంలో, గిల్, జడేజా, జైస్వాల్, పంత్ , కెఎల్ రాహుల్ బ్యాటింగ్‌తో అద్భుతంగా రాణించగా, మహ్మద్ సిరాజ్ , ఆకాష్ దీప్ బౌలింగ్‌తో మెరిశారు.
ఆకాష్ దీప్ రెండవ ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు మొదటి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు సహా మొత్తం 10 వికెట్లు తీసి విజయానికి హీరోగా నిలిచాడు. ఇంగ్లాండ్ ముందు 608 పరుగుల కఠినమైన లక్ష్యాన్ని భారత్ నిర్దేశించింది. ఈ భారీ స్కోరును ఛేదించే క్రమంలో ఆతిథ్య జట్టు 271 పరుగులకే ఆలౌట్ అయింది. ఇంగ్లాండ్ తరఫున వికెట్ కీపర్ జేమీ స్మిత్ 88 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.
ఇది కూడా చదవండి: Vaibhav Suryavanshi: నెక్ట్స్ మ్యాచ్‌లో డబుల్ సెంచరీ చేస్తా.. వైభవ్ సూర్యవంశీ ప్రమాణం
అయితే ఈ మ్యాచ్‌కు ముందు ఆకాష్ దీప్ పేరు కూడా వినిపించలేదు. పేలవమైన బౌలింగ్ కారణంగా భారత్ మొదటి మ్యాచ్‌లో ఓడిపోయింది. అలాగే, రెండో టెస్ట్‌లో బుమ్రాను భారత్ ఆడించదని నిర్ధారించుకున్నప్పుడు, క్రికెట్ విశ్లేషకులు అతని స్థానంలో ఎడమచేతి వాటం పేసర్ అర్ష్‌దీప్ సింగ్, ఎడమచేతి వాటం స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌లను ఆడించాలని సూచించారు. సునీల్ గవాస్కర్, మైఖేల్ క్లార్క్, రవిశాస్త్రి, ఆరోన్ ఫించ్ వంటి పలువురు మాజీ క్రికెటర్లు కూడా ఇదే సలహా ఇచ్చారు.భారత మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు ఎవరూ ఆకాష్ దీప్ పేరును ప్రస్తావించలేదు. అతను ఆటకు అప్రస్తుతం అని వారు భావించారు.
కానీ గంభీర్ వేరే లెక్క వేసాడు. 2వ టెస్ట్‌లో ఆకాష్ దీప్‌కు అవకాశం ఇవ్వడం ద్వారా అతను క్రికెట్ విశ్లేషకుల లెక్కలను తారుమారు చేశాడు. ఆకాష్ దీప్ కూడా తన ఎంపికను సమర్థించుకున్నాడు. ఇంగ్లాండ్ తన తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించగానే, గత మ్యాచ్‌లో సెంచరీలు సాధించిన ఓలీ పోప్ , బెన్ డకెట్‌లను ఇన్నింగ్స్‌లోని 2వ ఓవర్లోనే అవుట్ చేశాడు. ఈ విధంగా తన ఎంపికను ప్రశ్నించిన వారికి మ్యాచ్ ను గెలిపించి హీరోగా మాధానం ఇచ్చాడు.

