Dk shiva kumar: కర్ణాటక రాజకీయాల్లో ఇటీవల ఎక్కువగా చర్చకు వచ్చిన సీఎం మార్పు అంశంపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తుదికథ చెప్పారు. “నేను ఐదేళ్ల పదవీకాలం పూర్తి చేస్తాను. ముఖ్యమంత్రి స్థానంలో ఎలాంటి మార్పు ఉండదు” అని బుధవారం ఆయన స్పష్టంగా పేర్కొన్నారు. ఈ ప్రకటనతో సీఎం మార్పు ఖాయమంటూ వచ్చిన ఊహాగానాలకు తెరపడినట్లైంది.
బుధవారం మీడియాతో మాట్లాడిన సిద్ధరామయ్య, ముఖ్యమంత్రి మార్పుపై వస్తున్న వార్తలను ఖండించారు. “ఐదేళ్లు నేను ముఖ్యమంత్రిగా ఉంటాను. ఈ విషయంలో ఎవరికైనా అనుమానం ఎందుకు రావాలి?” అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిని మారుస్తారంటూ బీజేపీ, జేడీఎస్ పార్టీలు చేస్తున్న వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. “వారు కాంగ్రెస్ అధిష్ఠానమా? మా పార్టీ అంతర్గత విషయాలపై మాట్లాడే హక్కు వాళ్లకు లేదు” అంటూ ఆయన స్పందించారు.
శివకుమార్ స్పందన
ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా స్పందించారు. సిద్ధరామయ్యకు తన సంపూర్ణ మద్దతు ఉందని, అధిష్ఠానం చెప్పిన విధంగానే తన పాత్ర ఉంటుందని స్పష్టం చేశారు. “సిద్ధరామయ్యకు అండగా ఉండడం నా బాధ్యత. అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటా” అని చెప్పారు.
ఇటీవల కొంతమంది కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యల వల్లే సీఎం మార్పు చర్చలకు ఊతం లభించిందని భావిస్తున్నారు. ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ చేసిన వ్యాఖ్యలు, మంత్రి కే.ఎన్. రాజన్న చేసిన సూచనలు ఈ ఊహాగానాలకు ఆజ్యం పోసినట్లయ్యాయి. అయితే ఇప్పుడు సిద్ధరామయ్య, శివకుమార్ ఇద్దరూ చేసిన ప్రకటనలతో ఈ అంశంపై స్పష్టత వచ్చింది.