Tadipatri High Voltage: అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం మరోసారి రాజకీయ ఉద్రిక్తతలకు కేంద్ర బిందువైంది. జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఏడాదికి పైగా కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలో అడుగుపెట్టడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. టీడీపీ నాయకులు, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం పెద్దారెడ్డిని అడుగు పెట్టనివ్వము అంటూ తెగేసి చెబుతున్నారు. గత ఐదు సంవత్సరాల్లో వైఎస్సార్‌సీపీ ఏం చేసిందో ఉదాహరణలతో సహా పోలీసు వ్యవస్థకు వివరిస్తున్నారు. 2024 ఎన్నికల దగ్గర నుంచి నేటి వరకు ఇరు పార్టీల లీడర్ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూ వస్తోంది. నేడు ప్రత్యక్ష యుద్ధానికి దారితీసేలా పరిస్థితులు కనబడుతున్నాయి.
తాడిపత్రి నియోజకవర్గంలో ఈ వైరం ఈ నాటిది కాదు. జేసీ వర్సెస్ కేతిరెడ్డి కుటుంబాల మధ్య కొన్ని దశాబ్దాలుగా ఫ్యాక్షన్‌తో పాటు పొలిటికల్ యుద్ధం కొనసాగుతుంది. 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరఫున ఎమ్మెల్యేగా కేతిరెడ్డి పెద్దారెడ్డి గెలిచిన తర్వాత.. టీడీపీ, వైసీపీల మధ్య ఐదు సంవత్సరాల పాటు అక్కడ ఒక పెద్ద యుద్ధమే జరిగింది. 2024 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఓటమి తర్వాత అక్కడ రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పెద్దారెడ్డి తాడిపత్రిలో అడుగుపెట్టడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎలాగైనా తాడిపత్రిలో అడుగు పెట్టాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు పెద్దారెడ్డికి అనంతపురం పార్లమెంట్ వైఎస్సార్‌సీపీ నాయకుల అండ తోడైంది. ఎలాగైనా సరే తాడిపత్రిలోకి అడుగు పెట్టాలని పక్కా ప్రణాళికతో వైఎస్సార్‌సీపీ ముందుకు వెళుతుంది. జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా ధీటుగా ఎదుర్కొనే ప్రణాళికలే వేస్తున్నారు. పార్టీ నాయకుల మధ్య పోరు, లా అండ్ ఆర్డర్ కోసం పోలీసు యంత్రాంగం చేపడుతున్న చర్యల నడుమ తాడిపత్రి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
ఈ క్రమంలో తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిపై జిల్లా ఎస్పీ జగదీష్‌కు వైఎస్సార్‌సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. కోర్టు అనుమతి ఇచ్చినా తాడిపత్రిలోకి రానీయడం లేదంటూ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తాను తాడిపత్రి వెళ్లేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చిందని, తగిన భద్రత కల్పించాలని రెండు మాసాల కిందటే హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను రపా… రపా… నరుకుతామంటూ జేసీ బెదిరిస్తున్నారని, తనకు మద్దతుగా నిలిచిన వారిపై దాడులు జరుగుతున్నాయని పెద్దారెడ్డి ఆరోపించారు.
Also Read: Gudivada Amarnath: లోకేష్‌ని ర్యాగింగ్ చేస్తున్న గుడివాడ !
Tadipatri High Voltage: హింసకు పాల్పడుతున్న టీడీపీ నేతలపై పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయలేదన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి చేవ లేని రాజకీయాలు చేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తాడిపత్రిలో ప్రశాంత వాతావరణం ఉండేదన్నారు. ఆఫ్‌ట్రాల్ మున్సిపల్ చైర్మన్ జేసీ చెప్పినట్లు పోలీసులు నడుచుకోవడం హాస్యాస్పదమన్నారు. తనపై చేస్తున్న ఆరోపణలపై జేసీ ప్రభాకర్ రెడ్డితో బహిరంగ చర్చకు సిద్ధమని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సవాల్ విసిరారు. మరో వైపు తాడిపత్రిలో నియంత పాలన జరుగుతోందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని, తాడిపత్రి నియోజకవర్గంలోనూ ఆ కార్యక్రమం నిర్వహించాల్సి ఉందని, కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రి నియోజకవర్గంలోకి వెంటనే అనుమతించాలని ఆయన డిమాండ్ చేశారు.
తాడిపత్రిలో వైసీపీ వర్సెస్ టీడీపీ నేతల మధ్య ప్రత్యక్ష యుద్ధం మొదలైనట్లేనా? వైఎస్సార్‌సీపీ నేతలు అడుగు పెడతామంటున్నారు. టీడీపీ నేతలు దమ్ముంటే రండి చూద్దాం అంటూ సవాల్‌కు ప్రతి సవాల్ విసురుతున్నారు. పోలీసులకు మాత్రం ఈ నాయకుల సవాళ్లు, ప్రతి సవాళ్ల మధ్య లా అండ్ ఆర్డర్‌ని డీల్ చేయడం కత్తిమీద సాములా మారుతోంది. తాడిపత్రిలో ఏం జరుగుతుందో అని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. మొత్తానికి ఇద్దరు నాయకుల మధ్య మాటలు తూటాల్లాగా పేలుతున్నాయి. సై అంటే సై అంటూ కాలు దువ్వుతున్నారు. మరి తాడిపత్రిలో ఏం జరుగుతుందో చూడాలి.

