Acid Attack: మధ్యప్రదేశ్ రాష్ట్రం జబల్పూర్‌లో ఆదివారం రాత్రి దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. చిన్ననాటి స్నేహితుల మధ్య తలెత్తిన అసూయ.. ఒక అమ్మాయి ముఖంపై యాసిడ్ దాడిగా మారింది. ఈ ఘటన గౌరీఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అవధ్‌పురి కాలనీలో జరిగింది.
21 ఏళ్ల శ్రద్ధా దాస్, 22 ఏళ్ల ఇషితా సాహు చిన్నప్పటి నుంచి స్నేహితులే. ఇద్దరూ ఒకే ప్రాంతంలో నివసిస్తున్నారు. అయితే చదువులో శ్రద్ధా ముందుండటంతో, అదే విషయంలో ఇషితా అసూయతో మంటపట్టింది. ఇటీవల కొద్ది నెలలుగా వారిద్దరి మధ్య మాటలు తగ్గిపోయాయి. శ్రద్ధా, ఇషిత ఫోన్ నంబర్ కూడా బ్లాక్ చేసింది.
ఈ క్షుద్ర భావాలతో ఉన్న ఇషితా, శ్రద్ధా మీద తప్పుడు ఆలోచనలు పెంచుకుంది. ఆదివారం రాత్రి, పరీక్షల కోసం ఇంట్లో చదువుతున్న శ్రద్ధా దాస్‌ను బయటకు రమ్మంది. గేటు వద్ద కొద్ది నిమిషాలు మాట్లాడిన తరువాత, ఏ మాత్రం అంచనా లేకుండా యాసిడ్ తీసి శ్రద్ధా ముఖంపై పోసింది.
ఇది కూడా చదవండి: Pakistani Actress: పాకిస్థాన్ నటినంటూ పరిచయం.. రూ.21.74 లక్షల టోకరా
దీంతో శ్రద్ధా విలవిలలాడిపోయింది. తీవ్రంగా గాయపడిన ఆమెను స్థానికులు దగ్గరలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సమాచారం ప్రకారం శరీరంపై 50%కి పైగా కాలిన గాయాలు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నా, చికిత్స కొనసాగుతోంది.
పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించారు. బాధితురాలి స్టేట్‌మెంట్ ఆధారంగా అసూయ కారణంగానే ఈ దాడి జరిగిందని తేల్చారు. ఇషితాను అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకున్నారు. విచారణ కొనసాగుతోంది.
శ్రద్ధా తండ్రి తీవ్రంగా మానసికంగా కుంగిపోయారు. మా ఇంటి పిల్లలా చూసిన అమ్మాయి.. ఇలాంటి నీచమైన పని చేస్తుందని కలలో కూడా ఊహించలేదు. అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

