Raghunandan Rao: తెలంగాణ బీజేపీ కీలక నేత, మెదక్ లోకసభ సభ్యుడు రఘునందన్ రావుకు మళ్లీ మావోయిస్టుల నుంచి బెదిరింపు కాల్ వచ్చింది. ఆయన చేపట్టిన “ఆపరేషన్ కగార్”ను తక్షణమే నిలిపివేయాలని, లేకపోతే ప్రాణహాని తప్పదని ఆ కాల్‌లో హెచ్చరించారు. తమ సభ్యులు ఇప్పటికే హైదరాబాద్‌లో ఉన్నారని, ఆయనను కాపాడుకోవాలంటే చూసుకోవాలని సవాల్ విసిరారు.
ఈ బెదిరింపు కాల్ రఘునందన్ రావు హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో వచ్చింది. ఇటీవల కాలికి శస్త్రచికిత్స చేయించుకున్న ఆయన ఆసుపత్రిలోనే ఉన్న సమయంలో ఈ కాల్ రావడం తీవ్ర ఆందోళనకు కారణమైంది.
ఇంతకముందు, జూన్ 23న కూడా రఘునందన్ రావుకు ఇలాంటే బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. దాంతో ఆయన వెంటనే ఈ విషయాన్ని తెలంగాణ డీజీపీతో పాటు, సంగారెడ్డి మరియు మెదక్ ఎస్పీలకు ఫిర్యాదు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో పోలీసులు సీరియస్ అయ్యారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టి, ఆయనకు అదనపు భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని గుర్తించారు. తక్షణమే మెదక్ జిల్లా పోలీసులకు భద్రత పెంచాలని ఆదేశాలు జారీ చేశారు.
ఇదిలా ఉండగా, నిజామాబాద్‌లో పసుపు బోర్డు ప్రారంభం సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటనలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే రఘునందన్ రావుకు మావోయిస్టుల బెదిరింపు కాల్స్ రావడం రాజకీయంగా కలకలం రేపుతోంది. ఈ ఘటనపై అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.