Crime News: ఈస్ట్‌మారేడ్‌పల్లిలోని అడ్డగుట్టకు చెందిన 27 ఏళ్ల బి. సుష్మకు, నేరేడ్‌మెట్‌కు చెందిన అమృత్ (30)తో జనవరి 31న వివాహం జరిగింది. పెళ్లి సమయంలో సుష్మ తల్లిదండ్రులు రూ. 5 లక్షల నగదు, 6 తులాల బంగారు ఆభరణాలు, ఒక రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకును కట్నంగా ఇచ్చారు. సుష్మ, ఆమె భర్త అమృత్ ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు.
అయితే, పెళ్లయిన కొద్ది రోజులకే అదనపు కట్నం కావాలంటూ భర్త అమృత్‌తో పాటు అత్త, మామ, మరిది కలిసి సుష్మను వేధించడం మొదలుపెట్టారు. ఈ వేధింపులు రోజురోజుకూ పెరిగిపోయాయి. సుష్మ ప్రస్తుతం మూడు నెలల గర్భవతి అని తెలుస్తోంది. ఇటీవల ఆమె అనారోగ్యానికి గురవడంతో తల్లిదండ్రుల వద్దకు వచ్చి చికిత్స తీసుకున్నారు. ఈ నెల 13న ఆమెను ఆసుపత్రిలో చేర్చగా, 16న డిశ్చార్జి అయింది. డిశ్చార్జి అయిన తర్వాత తల్లిదండ్రులు ఆమెను పుట్టింటికి తీసుకెళ్లారు.
మరుసటి రోజు, తన ల్యాప్‌టాప్ తెచ్చుకోవడానికి సుష్మ తన తండ్రి అంజయ్యతో కలిసి అత్తగారింటికి వెళ్లారు. అక్కడ భర్త, అత్త, మామలు “మళ్లీ ఎందుకు వచ్చావు?” అంటూ సూటిపోటి మాటలు అనడమే కాకుండా, అదనపు కట్నం తీసుకురావాలంటూ అంజయ్యను దూషించారు. దీంతో సుష్మ తీవ్ర మనస్తాపానికి గురైంది. బుధవారం మధ్యాహ్నం సుష్మ ఎప్పటిలాగే తన హైటెక్ సిటీలోని సాఫ్ట్‌వేర్ కార్యాలయానికి విధులకు వెళ్లారు. అయితే రాత్రి ఒంటి గంట వరకు ఇంటికి తిరిగి రాకపోవడంతో తండ్రి అంజయ్య ఆందోళన చెందారు. కంపెనీ మేనేజర్‌కు ఫోన్ చేయగా, రాత్రి 8:30 గంటల సమయంలోనే సుష్మ బయటకు వెళ్లిపోయిందని తెలిసింది.
Also Read: Telegram CEO: టెలిగ్రామ్ సీఈఓ సంచలన నిర్ణయం: నా వీర్యదానంతో జన్మించిన 100 మందికి సంపద పంచేస్తా
Crime News: తెలిసిన చోట్ల అంతా గాలించినా ఆచూకీ లభించకపోవడంతో, గురువారం తెల్లవారుజామున 4 గంటలకు మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని గాలింపు చర్యలు ప్రారంభించారు. అయితే, గురువారం ఉదయం 7 గంటల ప్రాంతంలో దుర్గం చెరువులో ఒక యువతి మృతదేహం తేలినట్టు పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా, అది సుష్మ మృతదేహంగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
మాదాపూర్ ఇన్‌స్పెక్టర్ కృష్ణమోహన్ తెలిపిన వివరాల ప్రకారం, సుష్మ మృతికి అత్తింటి వేధింపులే కారణమని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు సుష్మ భర్త అమృత్, అత్త, మామలు, మరిదిపై భారత శిక్షాస్మృతిలోని 304బీ సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై తదుపరి విచారణ కొనసాగుతోంది.

