Thug Life: యూనివర్సల్ హీరో కమల్ హాసన్ నటించిన ‘థగ్ లైఫ్’ చిత్రం జూన్ 5న పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ రిలీజ్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. దిగ్గజ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, కర్ణాటకలో ఈ చిత్రం నిషేధానికి గురై సంచలనం సృష్టించింది. సినిమా ప్రమోషన్ సందర్భంగా కమల్ హాసన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు కన్నడ భాషపై అగౌరవంగా ఉన్నాయని కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆరోపించింది. కమల్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడంతో ఈ వివాదం హైకోర్టుకు చేరింది. హైకోర్టు కూడా కమల్ క్షమాపణ చెప్పాలని తీర్పు ఇవ్వడంతో, ఈ వ్యవహారం సుప్రీం కోర్టుకు చేరుకుంది.
శుక్రవారం సుప్రీం కోర్టులో జరిగిన విచారణలో, సినిమాపై అనధికార నిషేధంపై కర్ణాటక ప్రభుత్వానికి నోటీసులు జారీ అయ్యాయి. తదుపరి విచారణ జూన్ 17కి వాయిదా పడింది. ఇదిలా ఉంటే, ఇతర భాషల్లో ‘థగ్ లైఫ్’కు ప్రేక్షకుల నుంచి నీరసమైన స్పందన లభించడం గమనార్హం. ఈ వివాదం సినిమా భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.