Bangalore Stampede: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ‘విజయోత్సవ వేడుక’ అనగానే ఆర్సీబీ అభిమానుల హర్షధ్వానాలు ఊహించాం. కానీ ఆ వేడుక కన్నీటితో ముగిసింది. ఐపీఎల్ ట్రోఫీ సాధించిన ఆనందం కొన్ని గంటలకే చావు విలాపంగా మారిపోయింది. భారీగా తరలివచ్చిన అభిమానుల మద్య తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోవడం దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇప్పుడీ ఘటనకు గల అసలు కారణాలు వెలుగులోకి వస్తున్నాయి. అవేంటో ఓసారి చూద్దాం.
ఫ్రీ పాస్‌ల గోలే పెనుప్రమాదానికి దారి
ఆర్సీబీ విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి 3 లక్షల మంది అభిమానులు స్టేడియం వైపు పోటెత్తారు. కానీ స్టేడియం సామర్థ్యం మాత్రం కేవలం 35 వేల మంది మాత్రమే. సమస్య మొదలైనది ఇక్కడి నుంచే. సోషల్ మీడియాలో “7వ గేటు వద్ద ఉచిత పాస్‌లు ఇస్తున్నారట” అన్న మాటలు విపరీతంగా చక్కర్లు కొట్టాయి. ఫలితంగా ఆ గేట్ దగ్గరే భారీగా జనసంద్రం కదలింది.
ప్రవేశం ఉండేది కేవలం 5, 6, 7వ గేట్ల ద్వారానే. ముఖ్యంగా 7వ గేట్ నుంచే గ్రౌండ్ అంతా కనిపించడం, ఆర్సీబీ టీం ఆ మార్గంలోనే రావడం వల్ల ఆ గేట్ వద్దే కరెంటు లైన్లా జనాలు గుమిగూడారు. కొందరు గేట్లు దూకే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. ఆ సమయంలో ఏర్పడ్డ తోసాటుతోనే తొక్కిసలాట జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
అనూహ్య జనసందోహం – పోలీసులకు ఝలక్
ఈ భారీ వేడుకకు 5,000 మంది పోలీసులను మోహరించినప్పటికీ, వారు ఆశించిన దానికంటే మూడు రెట్లు ఎక్కువగా అభిమానులు వచ్చారు. గేట్ల పరిమితి, చిన్నదైన ప్రవేశ ద్వారాలు, అప్రమత్తంగా లేని క్యూలైన్ మేనేజ్మెంట్.. ఇవన్నీ కలిసొచ్చి గేట్లు విరిగిపోయే పరిస్థితికి దారితీశాయి. పాస్‌లు ఉన్న వారికే అనుమతి అన్న నిబంధన మానేసి, వదిలేసిన ప్రచారం ప్రమాదానికి కారణమైంది.
ఇది కూడా చదవండి: Love Story: పెళ్లి చేసుకున్న ప్రేమజంట.. 50 మందితో వచ్చి చితకబాదిన అమ్మాయి బంధువులు
పరేడ్ ప్రకటన – తప్పిన లైన్ క్లారిటీ
బుధవారం మధ్యాహ్నం 3.30కు అసెంబ్లీ నుండి స్టేడియం వరకు పరేడ్ ఉంటుందని మొదట ప్రకటించి, పోలీసుల అభ్యంతరాల వల్ల రద్దు చేయడంతో అభిమానులు అసమంజసానికి గురయ్యారు. స్టేడియంలో సన్మానం మాత్రమే ఉంటుందన్న క్లారిటీ లేని తీరుతో జనాలు ఏమాత్రం సందేహించకుండా స్టేడియాన్ని ఎక్కేశారు. కొందరు గేట్లు దూకి లోపలికి రావడానికి ప్రయత్నించగా పోలీసులు లాఠీఛార్జ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది.
ఆర్సీబీ మేనేజ్మెంట్ ప్లానింగ్ ఎక్కడ పాడయింది?
వేడి వేళలో పెరిగిన ఉద్రిక్తతలు, ఉచిత టికెట్ల హంగామా, క్లారిటీ లేని పరేడ్ ప్రకటన, అర్ధసారమైన భద్రతా ఏర్పాట్లు — ఇవన్నీ కలవడంతో ఫ్యాన్స్‌కి సెలబ్రేషన్ కాకుండా శ్మశాన వాతావరణం ఏర్పడింది.ఈ డిజిటల్ యుగంలో వాస్తవాలు తెలియకపోవడం కంటే, ఫేక్ ప్రచారాలు నమ్మడం ఇంకా పెద్ద ప్రమాదం అని చిన్నస్వామి స్టేడియం విషాదం ఘట్టంగా చెబుతోంది
మరణించిన వారికి నివాళి.. కానీ ప్రశ్నలు మిగిలేలా ఉన్నాయి
ఇప్పుడు 11 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. మరి బాధ్యత ఎవరిది? స్టేడియం నిర్వహణా సిబ్బందా? పోలీసుల పర్యవేక్షణ లోపమా? లేక ఆర్సీబీ మేనేజ్మెంట్ అవగాహన లోపమా? ఇవన్నీ అధికారిక విచారణల దశలో ఉన్నప్పటికీ, అభిమానులకైతే తమ చిరస్మరణీయ రోజు కన్నీటిదినంగా మిగిలిపోయింది.

