Kondagattu: జగిత్యాల జిల్లాలోని ప్రముఖ ఆంజనేయ స్వామి ఆలయం కొండగట్టు ఈరోజు హనుమాన్ జయంతి పురస్కరించుకొని కాషాయమయం అయింది. జై శ్రీరామ్, జై హనుమాన్ నినాదాలతో కొండగట్టు పర్వత ప్రాంతమంతా మారుమ్రోగిపోతూ, ఆధ్యాత్మికతతో నిండిపోయింది. తెల్లవారుజామున నుంచే భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి, స్వామివారి దర్శనానికి క్యూలైన్లలో నిలబడి ఉండటం గమనార్హం.
మాలధారులు దీర్ఘకాల దీక్షలను విరమించి, తలనీలాలు సర్పించి, అనుభూతులతో అంజన్న సన్నిధిలో తలవంచారు. కొందరు భక్తులు వర్షాన్ని లెక్కచేయకుండా కాలినడకన కొండగట్టుకు చేరుకున్నారు. భక్తిశ్రద్ధలతో ఆలయం చుట్టుపక్కల ప్రాంతం కదలికలతో నిండిపోయింది.
ఇప్పటికే బుధవారం రాత్రి 8 గంటల నుంచే భక్తుల రాక ప్రారంభమవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. భద్రతా దృష్ట్యా మరియు భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తెల్లవారుజామున జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్ స్వయంగా ఆలయ పరిసరాలను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. క్యూలైన్ల నిర్వహణ, పోలీస్ బందోబస్తు, మెడికల్ సదుపాయాలు తదితర అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు.
కొండగట్టు ఆలయం, తెలంగాణలో ఆంజనేయ స్వామికి ప్రసిద్ధి చెందిన ప్రధాన క్షేత్రాల్లో ఒకటి. ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతి సందర్భంగా ఇక్కడికి వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. ఈ ఏడాది భక్తుల రద్దీ మరింతగా పెరిగినట్టు తెలుస్తోంది.

