Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి, కేంద్ర సహకారం సాధన లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి ఢిల్లీకి పయనమయ్యారు. ఇవాళ రాత్రి ఆయన ఢిల్లీ బయలుదేరనున్నారు. గత నెలలో ఢిల్లీ పర్యటన పూర్తి చేసిన చంద్రబాబు… కేవలం నెల వ్యవధిలోనే మరోసారి ఢిల్లీకి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈసారి పర్యటన రెండు రోజుల పాటు సాగనుండగా, కేంద్ర మంత్రులతో కీలక సమావేశాలు, అలాగే వ్యాపారవేత్తలతో పెట్టుబడులపై చర్చలు జరగనున్నాయి. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి సహాయం పొందేందుకు చంద్రబాబు ఈ పర్యటనను సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నారు.
ఏకంగా ఏడుగురు కేంద్ర మంత్రులతో సమావేశం
రేపు రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు ఏకంగా ఏడుగురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. ఈ భేటీల్లో రాష్ట్రానికి అవసరమైన ప్రాజెక్టులు, నిధుల మంజూరుపై చర్చించనున్నట్లు సమాచారం. ప్రత్యేకంగా పారిశ్రామిక అభివృద్ధిపై దృష్టిసారించనున్న చంద్రబాబు… పెట్టుబడుల ఆకర్షణకై ప్రముఖ వ్యాపారవేత్తలతో సాయంత్రం సమావేశం కానున్నారు.
ఇది కూడా చదవండి: Crime News: మేనల్లుడితో అక్రమ సంబంధం.. అడ్డు వస్తున్నాడని భర్తను చంపిన భార్య.. కట్‌చేస్తే..
నీతి ఆయోగ్ భేటీకి హాజరు
ఈ నెల 24న నిర్వహించనున్న నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశానికి కూడా చంద్రబాబు హాజరుకానున్నారు. ఈ సమావేశానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యే అవకాశం ఉంది.
కేబినెట్ సమావేశంలో ముందస్తు చర్చలు
ఇటీవలే జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో ఢిల్లీ పర్యటనలో చర్చించాల్సిన అంశాలపై చర్చించామని అధికార వర్గాలు తెలిపాయి. రెండు రోజుల క్రితం ముగిసిన కేబినెట్ సమావేశం తర్వాత వెంటనే ఢిల్లీకి పయనమవడం విశేషం.
ఈ పర్యటన ద్వారా కేంద్రంతో సంబంధాలను బలోపేతం చేసి, రాష్ట్రాభివృద్ధికి అవసరమైన మద్దతును సాధించాలనే లక్ష్యంతో చంద్రబాబు పయనమవుతున్నారు.

