Jr NTR: తెలుగుదేశం పార్టీ మహానాడు ఈ నెల 27, 28, 29 తేదీల్లో కడపలో జరగనుంది. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ మహానాడుకు హాజరవుతారా అన్న చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. టీడీపీ స్థాపకుడు ఎన్టీఆర్ మనవడైన తారక్, 2009 ఎన్నికల్లో పార్టీ తరఫున ప్రచారం చేసినప్పటికీ, ఆ తర్వాత టీడీపీతో దూరాన్ని మెయింటైన్ చేశారు. 2014లో చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారానికి హాజరైన తారక్, ఆ తర్వాత రాజకీయాలకు దూరమయ్యారు. నారా వర్సెస్ నందమూరి అన్నట్లుగా ఇరు
కుంటుంబాల మధ్య దూరం పెరగడం, చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరికి అవమానం జరిగినప్పుడు సరైన తీరులో స్పందించకపోవడం, టీడీపీకి శత్రువులైన వల్లభనేని వంశీ, కొడాలి నాని వంటి వారిని వెనకేసుకుని రావడం, టీడీపీకి అండగా నిలవాల్సిన అనేక సందర్భాల్లో ఎవరూ ఆశించని విధంగా తటస్థ వైఖరికి పరిమితం అవ్వడం, తద్వారా టీడీపీ కార్యకర్తల ఆగ్రహానికి గురవ్వడం తెలిసిందే.
అయితే ఇటీవల ఒకట్రెండు సందర్భాల్లో కొంత ఆశాజనకమైన సంఘటనలు చోటుచేసుకున్నాయి. లోకేష్.. తన పర్యటనలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీ పట్టుకుని తారక్ అభిమానుల్లో జోష్ నింపితే, మరో సందర్భంలో నందమూరి కళ్యాణ్ రామ్ టీడీపీ జెండా ఎగరేసి క్యాడర్‌ని ఉత్సాహపరిచారు. ఇక బాలయ్యకు పద్మభూషణ్ పురస్కారం వరించడం పట్ల.. జూనియర్ ఎన్టీఆర్ ఎంతో ఆప్యాయంగా సోషల్‌మీడియాలో విష్ చేశారు. ఈ సంఘటనల నేపథ్యంలో నారా చంద్రబాబు – నందమూరి హరికృష్ణ కుటుంబాల మధ్య సఖ్యత మళ్లీ పెరిగిందనీ, టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ మళ్లీ దగ్గరవుతున్నారని కూడా కథనాలొచ్చాయ్.
Also Read: Promotion for Lokesh: ‘మహానాడు’ సంచలనాలు.. చంద్రబాబు కీలక నిర్ణయాలు
Jr NTR: మహానాడుకు సంబంధించి నందమూరి కుటుంబ సభ్యులకు అందే ఆహ్వానంలో భాగంగానే తారక్ కుటుంబానికి కూడా ఆహ్వానం అందుతుంది. టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు ఈ ఆహ్వాన బాధ్యతలను చంద్రబాబు అప్పగించారని సమాచారం. అయితే, తారక్ హాజరయ్యే అవకాశం తక్కువని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సినీ కెరీర్‌పై దృష్టి సారించిన తారక్, రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, జూన్ లేదా జూలై నెలలో తారక్ తన అభిమానులతో భారీ సమావేశం నిర్వహించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మే నెలలోనే సమావేశం జరపాలని తొలుత అనుకున్నప్పటికీ.. మహానాడుకు పోటీగా జరిపినట్లు సందేశం వెళ్తుందని, అదీ కాక మే నెలలో మండే ఎండల్లో అభిమానుల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక.. జూన్ లేదా జూలై నెలలో ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. మరి ఇది రాజకీయ ఎంట్రీగా మారుతుందా లేదా సినీ వేడుకగానే మిగిలిపోతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి నందమూరి అభిమానులతో పాటూ… టీడీపీ కార్యకర్తలు కూడా తారక్ నిర్ణయం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న పరిస్థితి.

