Road Accident: హైదరాబాద్ శివారులో మరోసారి రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం తెల్లవారుజామున హయత్‌నగర్ మండలంలోని కుంట్లూరు సమీపంలో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.
అందిన సమాచారం ప్రకారం, వేగంగా వచ్చిన డీసీఎం వ్యాన్ అదుపుతప్పి ఎదురుగా వస్తున్న కారు ని బలంగా ఢీకొట్టింది. ఢీకొట్టిన తీవ్రతతో కారు పూర్తిగా నుజ్జునుజ్జయి, అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమయంలో కారు వెనుకసీట్లో ఉన్న మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.
ఇది కూడా చదవండి: HariHara VeeraMallu: నేడే ‘హరిహర వీరమల్లు’ మొదటి ప్రెస్ మీట్.. ఎన్నిటికో తెలుసా..?
ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్ట్‌మార్టం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తిని అత్యవసర చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం, డీసీఎం అత్యంత వేగంగా, అజాగ్రత్తగా నడిపిన కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో జాతీయ రహదారిపై కొంతసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. మృతుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.