Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో భారత్, పాకిస్థాన్ మధ్య చోటుచేసుకున్న తీవ్ర ఉద్రిక్తతల సమయంలో తాను జోక్యం చేసుకుని అణుయుద్ధానికి దారి తీసే స్థితిని అడ్డుకున్నానని తెలిపారు. ఫాక్స్ న్యూస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, “అప్పుడు పరిస్థితి తీవ్రంగా ఉండేది. క్షిపణుల దాడులు జరుగుతున్నాయి. తదుపరి దశలో అణుఅస్త్రాల వాడకానికి కూడా వెళ్లేలా ఉంది. అప్పుడు నేను జోక్యం చేసుకున్నాను,” అని అన్నారు.
ట్రంప్ తెలిపిన వివరాల ప్రకారం, రెండు దేశాలను వ్యాపార అంశంతో శాంతికి ఒప్పించానని, ‘‘మీరు యుద్ధం ఆపితే మేము మీతో వ్యాపారం చేస్తాం, లేదంటే కాదు’’ అనే విధంగా మాట్లాడానన్నారు.
అదే సందర్భంలో ట్రంప్ భారత్ విధిస్తున్న అధిక సుంకాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘ప్రపంచంలో అత్యధికంగా సుంకాలు వేయడం భారత్‌కే చెల్లింది. కానీ చివరికి మా ఒత్తిడి వల్ల 100 శాతం సుంక తగ్గించేందుకు వారు అంగీకరించారు,’’ అని అన్నారు. అయితే దీనిపై భారత్ ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
Also Read: America: అమెరికాలో టోర్నడోలు బీభత్సం.. 22 మంది మృతి
Donald Trump: భారత్‌తో త్వరలో వాణిజ్య ఒప్పందం కుదురుతుందని ట్రంప్ విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే తాను తొందరపడటం లేదని, అనేక దేశాలు అమెరికాతో ఒప్పందాల కోసం ఎదురుచూస్తున్నాయని వెల్లడించారు. భారత్-పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతల విషయంలో తానే పరిష్కారకర్తనని ట్రంప్ ఇది ఏడోసారి చెప్పడం గమనార్హం.