ACB Case: పోలీస్ అంటే క్రమశిక్షణకు మారు పేరు.. పోలీస్ అంటే నియమాలకు ఆలవాలం.. పోలీస్ అంటే అక్రమార్కుల గుండెల్లో సింహస్వప్నం.. అదే పోలీస్ అవినీతికి పాల్పడితే.. ఆ శాఖకే మాయని మచ్చ. ఇలా కొందరు పోలీస్ అధికారులే లంచాలకు మరిగి పోలీస్ శాఖ పరువును బజారున పడేస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో మితిమీరిన కొందరు పోలీస్ అధికారుల అవినీతి పుట్టలు ఏసీబీ దాడుల్లో పగులుతున్నాయి. ఏకంగా జిల్లా కేంద్రంలోనే అవినీతి కంపు తేటతెల్లమైంది.
ACB Case: ఒకటి కాదు.. రెండు కాదు.. వందలు, వేలు అసలే కాదు.. ఏకంగా రూ.25 లక్షల సొమ్ము డిమాండ్.. ఊరికే అవినీతి సొమ్ముతో ఊరేగుదామని ఆశపడ్డారు. నగదు, బంగారంతో తులతూగాలని అవినీతి ఊబిలో చిక్కుకున్నారు. తీరా ఏసీబీ దాడుల్లో పట్టుబడి ఉన్న ఉద్యోగాలకే ఎసరు తెచ్చుకున్నారు.
ACB Case: వారు సామాన్య హోంగార్డు, కానిస్టేబుల్ కాదు.. హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ, ఎస్ఐ కానే కాదు.. పెద్దరికంతో బాసిజం చెలాయించే ఒకాయన డీఎస్పీ, మరొకాయన సీఐ.. వీరిద్దరూ సూర్యాపేట జిల్లా కేంద్రంలో లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఒక కేసులో బాధ్యుడిని అరెస్టు చేయకుండా ఉండేందుకే ఏకంగా రూ.25 లక్షలు డిమాండ్ చేశారు. రూ.16 లక్షలతో డీల్ కుదుర్చుకున్నారు. బాధితుడు ఏసీబీని ఆశ్రయించడంతో వలపన్ని ఆ ఇద్దరినీ పట్టుకున్నారు.
ACB Case: సూర్యాపేట సబ్ డివిజన్ డీఎస్పీ కే పార్థసారథి, సూర్యాపేట పట్టణ ఇన్‌స్పెక్టర్ వీర రాఘవులు ఇద్దరు అవినీతి పోలీస్ అధికారులను నల్లగొండ ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. జిల్లా కేంద్రమైన సూర్యాపేట పట్టణంలో ఓ కేసు విషయంలో బాధ్యుడిని అరెస్టు చేయకుండా ఉండటానికి అతని వద్ద రూ.25 లక్షలు ఇవ్వాలని వారిద్దరూ డిమాండ్ చేశారు.
ACB Case: ఆ బాధితుడు డీఎస్పీ కే పార్థసారథి, ఇన్‌స్పెక్టర్ వీర రాఘవులుతో రూ.16 లక్షలు ఇచ్చేందుకు డీల్ కుదుర్చుకున్నాడు. అనంతరం ఆ బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. అనుమతి లేని ఓ స్కానింగ్ సెంటర్ నిర్వహణ విషయంలో నమోదైన కేసు విషయంలో ఆ స్కానింగ్ సెంటర్ నడిచేలా, ఆ నిర్వాహకుడిని అరెస్టు చేయకుండా ఉండేందుకు ఈ డీల్ కుదిరినట్టు ఏబీసీ అధికారులు లేఖను విడుదల చేశారు. హైదరాబాద్ నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో డీఎస్పీ, ఇన్‌స్పెక్టర్‌ను హాజరు పరుస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు.
ACB Case: ఇలాంటి కేసులు ఎన్ని నమోదు అవుతున్నా పోలీస్ శాఖలో ఇంకా కొందరు అవినీతిని మరువడం లేదని పలువురు పేర్కొంటుడటం కొనమెరుపు. ఏకంగా జిల్లా కేంద్రంలో, ఎస్పీ, ఇతర పోలీస్ ఉన్నతాధికారులు ఉండే చోటే ఇలాంటి అవినీతి అవకతవకలు జరుగుతుంటే.. మారుమూల మండల కేంద్రాల్లో ఇంకా ఎలాంటి అవినీతి రాజ్యమేలుతుందో.. తెలిసిపోతుంది.

