Cm chandrababu: ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వమే భారతదేశానికి శ్రీరామరక్ష అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలోని చాయాపురంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, దేశం ఒక రకమైన యుద్ధ వాతావరణాన్ని ఎదుర్కొంటోందని, ఉగ్రవాదుల చర్యల వల్ల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పహల్గామ్‌లో అమాయక పౌరులను ఉగ్రవాదులు దారుణంగా హతమార్చిన ఘటన అత్యంత బాధాకరమని తెలిపారు. భారతదేశం ఎప్పటికీ ఉగ్రవాదాన్ని త్రికరణ శక్తులతో వ్యతిరేకిస్తుందని, హింసకు ప్రపంచంలో ఎక్కడా స్థానం లేదని ప్రధాని మోదీ తరచూ చెబుతుండటాన్ని గుర్తుచేశారు.
పాకిస్థాన్ తరచూ భారత దేశంపై కవ్వింపు చర్యలు చేస్తోందని మండిపడ్డ చంద్రబాబు, దేశ రక్షణ కోసం అనేక మంది యువకులు సైన్యంలో చేరుతున్నారని, వారి త్యాగాల వల్లనే మనం నిశ్చింతగా జీవించగలుగుతున్నామని అన్నారు.
ఈ సందర్భంగా ఉగ్రవాదులతో జరిగిన పోరులో వీరమరణం పొందిన తెలుగు సైనికుడు మురళీ నాయక్ గురించి మాట్లాడుతూ, ఆయన మరణం తనను తీవ్రంగా కలచివేసిందని అన్నారు. మురళీ నాయక్ తల్లిదండ్రులతో మాట్లాడి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశానని, వారి కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా తోడుగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.
ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించిన చంద్రబాబు, సైనికుల సేవలు వెలకట్టలేనివని, అందరూ వారిని గౌరవించాలని ఆకాంక్షించారు. అనంతరం “భారత్ మాతాకీ జై” అంటూ నినాదాలు చేసి, మురళీ నాయక్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ రెండు నిమిషాల మౌనం పాటించారు.