Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ భార్య హిమాన్షి నర్వాల్‌పై సోషల్ మీడియాలో పెరిగిన ట్రోలింగ్‌కు జాతీయ మహిళా కమిషన్ (NCW) గట్టిగా స్పందించింది. దేశానికి సేవ చేసిన ఓ జవాన్ భార్యను ఈ తరహాలో లక్ష్యంగా చేసుకోవడం సిగ్గుచేటని స్పష్టం చేసింది.
ఏప్రిల్ 22న కశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు మరణించిన తర్వాత, హిమాన్షి నర్వాల్ ప్రజలకు శాంతి పిలుపునిచ్చారు. “ఈ దాడికి ముస్లింలు, కశ్మీరీల మొత్తం సమాజం బాధ్యత వహించాల్సిన అవసరం లేదు,” అని ఆమె వ్యాఖ్యానించారు. ఆమె మితమైన మాటలు కొందరికి ఇష్టం లేకపోవడంతో, సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు, అసభ్యపదజాలంతో కామెంట్లు వెల్లువెత్తాయి.
జాతీయ మహిళా కమిషన్ దీనిపై స్పందిస్తూ, వ్యక్తిగత నమ్మకాలు, భావజాలాల ఆధారంగా ఓ మహిళను లక్ష్యంగా చేసుకోవడం దారుణమని పేర్కొంది. “సామాజిక మాధ్యమాల్లో మహిళలపై ఈ తరహా దాడులు ఆమోదయోగ్యం కావు,” అని స్పష్టం చేసింది. “భిన్న అభిప్రాయాలను వ్యక్తీకరించడం రాజ్యాంగంలో కలిగిన హక్కు. దీనికి విరుద్ధంగా వాఖ్యలు చేయడం సరైంది కాదు” అని హెచ్చరించింది.
Also Read: Bandi Sanjay: మావోయిస్టులతో మాటల్లేవ్.. మాట్లాడుకోడాల్లేవ్..
Pahalgam Terror Attack: హిమాన్షి, లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ ఇద్దరూ ఏప్రిల్ 16న ముస్సోరీలో పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన ఆరు రోజుల్లోనే – ఏప్రిల్ 22న – పహల్గామ్ ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడిలో వినయ్ ప్రాణాలు కోల్పోయారు. వారు హనీమూన్‌లో ఉన్న సమయంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. వినయ్ అంత్యక్రియలు ఏప్రిల్ 23న కర్నాల్‌లో జరిగాయి. అతను గతంలో కొచ్చిలోని సదరన్ నావల్ కమాండ్‌లో పనిచేశారు.
జాతీయ మహిళా కమిషన్ వ్యాఖ్యానంలో స్పష్టంగా చెప్పింది – భర్తను కోల్పోయిన మహిళపై ఇలాంటివి భరించదగినవి కావు. దేశం మొత్తం దుఃఖంలో ఉన్నప్పుడు, బాధను మరింత పెంచే ప్రయత్నాలు బాధ్యతారాహిత్యంగా ఉంటాయని NCW హెచ్చరించింది. హిమాన్షి నర్వాల్ తాను చెప్పిన మాటలు కొందరికి నచ్చకపోయినా, అభిప్రాయ స్వేచ్ఛను గౌరవించడం ప్రజాస్వామ్యంలో చాలా ముఖ్యమని కమిషన్ స్పష్టం చేసింది.


