MP Chamala Kiran Over: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జాతీయవాద గళాన్ని మరోసారి బలంగా వినిపించారు. కాశ్మీర్‌లో జరిగిన దారుణ ఉగ్రదాడిపై మంగళగిరి జనసేన కార్యాలయంలో సంతాపం తెలిపిన ఆయన, దాడిలో ప్రాణాలు కోల్పోయిన జనసేన సభ్యుడు మధుసూదన్ కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మతం పేరుతో 26 మందిని చంపిన ఉగ్రవాదుల దారుణాన్ని, సూడో-సెక్యులరిజం పేరుతో దాన్ని సమర్థించే వారిని తీవ్రంగా ఖండించారు. పాకిస్థాన్‌పై సానుభూతి చూపే కాంగ్రెస్ నేతలను ఉద్దేశిస్తూ.. భారత్‌ను వీడి పాకిస్థాన్‌కు వెళ్లాలని హెచ్చరించారు. జనసేన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నప్పటికీ జాతీయవాదానికి కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు.
పవన్ వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో కలకలం రేపాయి. ఈ క్రమంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, జబ్బలు చరచుకుని పవన్‌కి కౌంటర్ ఇవ్వడానికి రంగంలోకి దిగారు. ఆయన మాట్లాడిన మాటలు చూస్తుంటే… అసలు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఆయన బుర్రకు ఎక్కినట్లే అనిపించలేదంటున్నారు పరిశీలకులు. మతం పేరుతో హిందువులను వేరు చేసి చంపారని, పెహల్గావ్ దాడి బాధితులు, ప్రత్యక్ష సాక్షులు ఒకవైపు చెబుతోంటే.. ఈ కాంగ్రెస్ నేతలు కొందరు ఉగ్రవాదులు మతం పేరుతో చంపలేదనీ, అదంతా మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు బీజేపీ చేస్తున్న ప్రచారమని అడ్డగోలుగా వాగారు. ఈ వ్యాఖ్యలు సహజంగానే అందరికీ ఒళ్లు మండేలా చేశాయి. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ స్పందించాల్సి వచ్చింది. ఉగ్రవాదుల దాష్టీకానికి భర్తను పోగొట్టుకున్న భార్య అబద్దం చెప్తుందా? కొడుకును పోగొట్టుకున్న తల్లిదండ్రులు అబద్దమాడతారా? అసలు ఈ కాంగ్రెస్ నేతలు ఒక్కోసారి బుద్ధుండే మాట్లాడతారా?
లేక మైండ్‌ని భద్రంగా లాకర్‌లో దాచి పెట్టి బయట తిరుగుతుంటారా? అంటూ విరుచుకుపడుతున్నారు జాతీయ వాదులంతా. ఇక్కడ ఓ మతాన్ని దూషించమనో, వారిపై దాడులు చేయమనో అనటం లేదు.. కానీ మతం పేరుతో చంపారన్న నిజాన్ని దాచిపెట్టాల్సిన పని కూడా లేదు. అయితే ఎంపీ చామలకు ఏ మర్థమైందో తెలీదు. సూడో సెక్యులరిస్ట్ అనగానే కాంగ్రెసోళ్లే కదా అనుకుని ఉండొచ్చు ఆయన. అలా చూసినా.. ఆయన ఇచ్చిన కౌంటర్‌కి, పవన్ స్టేట్‌మెంట్‌కి నక్కకి నాగలోకాని ఉన్నంత తేడా ఉందంటున్నారు పలువురు విశ్లేషకులు. రాజకీయాలంటే సినిమా కాదని, పవన్ కళ్యాన్ ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివారనీ, స్థాయికి తగ్గట్టు మాట్లాడాలని… పదేళ్ల కిందట పవన్ కళ్యాణ్ అనుకుని మాట్లాడినట్లున్నారు చామల కిరణ్ కుమార్‌రెడ్డి. కంగనా రనౌత్‌లా సినిమాలు చేస్తూ మోదీకి సపోర్ట్ చేసుకోమని ఓ సలహా కూడా ఇచ్చారు వెటకారంగా. చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ఇంకా చాలా నయం. మర్యాదగా పాకిస్థాన్‌కి పొమ్మన్నారు. అలా మర్యాదగా వెళ్లగొట్టడం ఏంటనీ, భారత్‌లో ఉంటూ పాకిస్థాన్‌కి సపోర్ట్ చేస్తున్న వాళ్లని దేశ ద్రోహం కింద అరెస్టు చేసి జైల్లో పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు సిసలైన సెక్యులరిస్టులు.
Also Read: KMM Kallur Candidate: కొత్త నియోజకవర్గం పట్టాభికి ఫిక్స్ అయ్యిందా?
MP Chamala Kiran Over: చామల విమర్శలు పవన్ వ్యాఖ్యలకు సంబంధం లేనివిగా, సందర్భానికి తగనివిగా కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంచితే… కాంగ్రెస్ నేతలు అద్దంకి దయాకర్, సిద్ధరామయ్య వంటి వారు పాకిస్థాన్‌పై సానుభూతి వ్యక్తం చేస్తూ, పాక్‌పై యుద్ధం చేస్తే ఒప్పుకోం, ఐ లవ్ పాకిస్థాన్ అంటూ.. పాకీలపై వల్లమాలిన ప్రేమని ఒలకబోశారు. వీరి వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా వివాదాస్పదమై, కాంగ్రెస్‌పై ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది. దీంతో కాంగ్రెస్ అధిష్ఠానం ఈ వ్యాఖ్యలను వారి వ్యక్తిగత అభిప్రాయాలుగా పేర్కొంటూ, పార్టీకి ఏ మాత్రం సంబంధం లేదంటూ.. సదరు నేతల్ని ఛీకొట్టి వదిలించుకుంది.
పవన్ జాతీయ భద్రతపై చూపిన దృఢమైన ధోరణి, కాంగ్రెస్ నేతల ద్వంద్వ వైఖరికి వ్యతిరేకంగా దేశ ప్రజల మనోభావాలకు సరితూగుతోంది. పవన్ వ్యాఖ్యలు దేశ ప్రజల భావోద్వేగానికి అద్దం పడుతోంటే.. కాంగ్రెస్ నేతలు ఇలాంటి సున్నితమైన సమయంలోనూ తప్పుడు మాటలు మాట్లాడి రాజకీయ నష్టాన్ని కొనితెచ్చుకుంటున్నారని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.