Vizianagaram: క్షణాకావేశంలో తీసుకునే నిర్ణయాలు వల్ల జీవితాలే నాశనం అవుతున్నాయి. ఇలాంటి ఘటనలు ప్రస్తుత సమాజంలో ఆందోళన కలిగిస్తున్నాయి. చిన్న చిన్న గొడవలకే మానవత్వం మరిచిపోయి స్నేహితులను, పిల్లలను, అన్నదమ్ములను చంపుకుంటున్నారు. ఆస్తుల కోసం అయితే..ఏకంగా తోబుట్టవులను, తల్లిదండ్రులను సైతం చంపడానికి వెనుకాడడం లేదు. తల్లిదండ్రులు ఆస్తుల్లో కూతుర్లకు కూడా వాటా ఇవ్వాలని గత ప్రభుత్వాలు చట్టాలు తీసుకొచ్చాయి.. అయితే, చాలా ప్రాంతాల్లో ఈ చట్టాలను పట్టించుకోవడం లేదు..
తాజాగా విజయనగరం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పూసపాటిరేగ మండలం నడిపూరకల్లాలు గ్రామానికి చెందిన తల్లిదండ్రులు అప్పలనాయుడు, జయమ్మ ఇటీవల తన కూతురికీ ఆస్తి ఇవ్వడంతో.. కుమారుడు రాజశేఖర్ జీర్ణించుకోలేకపోయాడు. తనకు దక్కాల్సిన మొత్తం ఆస్తిలో చెల్లికి ఇవ్వడంపై పేరెంట్స్ పై కక్ష పెంచుకున్నాడు.
ఈ క్రమంలోనే తల్లిదండ్రులను దారుణంగా చంపేశాడు. కనిపెంచిన సొంత తల్లిదండ్రులు అని కూడా చూడకుండా ట్రాక్టర్ తో ఢీకొట్టి దారుణంగా చంపాడు. ఈ దారుణ హత్య స్థానికంగా కలకలం రేపింది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

