Komatireddy Venkatreddy: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మంత్రి కొమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, కేసీఆర్ తమ పార్టీ అగ్రనాయకురాలు సోనియా గాంధీ కాళ్లు మొక్కిన వ్యక్తి అని ఆయన ఆరోపించారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో సోనియా గాంధీ కీలక పాత్ర పోషించారని, ఆమె లేకపోతే తెలంగాణ సాధ్యం కాదని స్పష్టం చేశారు. “తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీనే” అని అప్పట్లో కేసీఆర్ స్వయంగా చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. కానీ, రాష్ట్రాన్ని పొందిన తర్వాత కేసీఆర్ పాలన అవినీతి మయమైనదిగా మారిందని విమర్శించారు.
బీఆర్ఎస్ పరిపాలనపై కూడా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత పదేళ్లలో కేసీఆర్ సుమారు రూ. 10 లక్షల కోట్లు అక్రమంగా సంపాదించారని ఆరోపించారు. కేసీఆర్ పాలనలో అవినీతిలో భాగమైన కొందరు జైలులో ఉన్నారని, మరికొందరు అమెరికాలో తలదాచుకున్నారని అన్నారు.
రాజకీయంగా బీఆర్ఎస్‌ను ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. నల్గొండ జిల్లా నేతలు తలచుకుంటే, ఇటీవల ఎల్కతుర్తిలో జరిగిన సభ కంటే ఎక్కువ సంఖ్యలో ప్రజలు పాల్గొనే సభ నిర్వహించగలమని ధీమా వ్యక్తం చేశారు.
అంతేకాకుండా, కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు తాము కట్టుబడి ఉన్నామని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు.