Amaravati: పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో వదంతులు: సోషల్ మీడియా వార్తలపై డీజీపీ సీరియస్ 

Amaravati: జమ్ము కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిని నేపథ్యంగా చేసుకొని, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తప్పుడు వార్తలపై ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

‘భారత ప్రభుత్వం అత్యవసర భద్రతా సూచనలు జారీ చేసింది’, ‘ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని ప్రాంతాలను హై-అలర్ట్ జోన్లుగా ప్రకటించారు’ అనే వదంతులు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చక్కర్లు కొడుతున్నాయని ఆయన తెలిపారు. అయితే, వీటిలో ఏమాత్రం నిజం లేదని స్పష్టంగా చెప్పారు.

“భారత ప్రభుత్వం గానీ, రాష్ట్ర ప్రభుత్వం గానీ ఇప్పటివరకు ఎలాంటి అత్యవసర భద్రతా సూచనలు లేదా హై-అలర్ట్ ప్రకటనలు జారీ చేయలేదు,” అని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా స్పష్టం చేశారు.

ఇలాంటి నిరాధారమైన సమాచారం ప్రజల్లో భయాన్ని, అయోమయాన్ని పెంచేందుకు ఉద్దేశపూర్వకంగా వ్యాప్తి చేస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ధృవీకరించని సమాచారాన్ని నమ్మకూడదని, పంచుకోకూడదని సూచించారు.

సామాజిక మాధ్యమాల్లో వచ్చే ప్రతి వార్తను గుడ్డిగా నమ్మకుండా, అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని హరీశ్ కుమార్ గుప్తా విజ్ఞప్తి చేశారు.

వదంతులు వ్యాపింపజేసి ప్రజల్లో గందరగోళం సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎటువంటి అనుమానాస్పద సమాచారం ఉన్నా, అధికారిక ప్రకటనల కోసం వేచి చూడాలని, లేకపోతే నేరుగా పోలీసులను సంప్రదించాలని సూచించారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Tamilnadu: తిరుపతి ట్రైన్ లో కామాంధుడు.. గర్భిణీ స్త్రీపై లైంగిక వేదింపులు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *