Cm revanth: పహల్గామ్ భారతీయ పర్యాటకులపై ఉగ్రవాదుల పాశవిక దాడులను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఖండించారు. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా ఉండాలంటే భారత ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలన్నారు. దేశం అభివృద్ధి పథంలో నడుస్తున్న ఇలాంటి టైంలో ఉగ్రదాడులు అభివృద్దికి ఆటంకమని, పహల్గాం ఉగ్రదాడికి కారకులైన వారిని ఏ ఒక్కరిని వదలకూడదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను భారత్ లో కలపండని అన్నారు. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లోని పీపుల్స్ ప్లాజానుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు పహల్గాం ఉగ్రదాడిలో చనిపోయిన మృతులకు నివాళులర్పిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి..ఉగ్రవాదం అంతమొందించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయానికి మద్దతిస్తామని తెలిపారు.
‘‘ఉగ్రవాదంపై భారత ప్రభుత్వం చేపట్టే ప్రతీ చర్యకు మద్దతు పలికేందుకు అందరం సిద్ధంగా ఉన్నాం. అందరం ఏకమై తీవ్రవాదాన్ని అంతమొందించి దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాలి. దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నాం. ఉగ్రవాద దాడుల్లో మరణించిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం సానుభూతి తెలుపుతోంది. ఆ కుటుంబాలకు అందరం అండగా నిలబడి మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుతున్నాం. 1967, 1971 లో ఇలాంటి దాడులు జరిగినపుడు ఇందిరాగాంధీ గట్టి జవాబు ఇచ్చారు. ఒక్క దెబ్బతో పాకిస్తాన్ ను పాకిస్తాన్, బంగ్లాదేశ్ అని రెండు ముక్కలు చేశారు. ఆ సందర్భంలో ఇందిరాగాంధీని వాజ్ పేయ్ దుర్గామాతతో పోల్చారు. ప్రధాని మోడీ గారు మీరు దుర్గామాత భక్తులుగా ఇందిరాగాంధీని ఆదర్శంగా తీసుకోండి. ఉగ్రమూకలకు గట్టి జవాబు ఇవ్వాలి. కోట్లాదిభారతీయులంతా మీకు మద్దతుగా ఉంటారు… ఒక్క దెబ్బతో పాకిస్థాన్ ను రెండు ముక్కలు చేయండి’’ అన్నారు.
ఏఐసీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు,ఎమ్యెల్యే లు, ఎమ్మె్ల్సీలు, మహిళ కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇందిరాగాంధీ విగ్రహం దగ్గర పహల్గాం మృతులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సంఘీభావంగా ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ, భారత్ సమ్మిట్ లో పాల్గొనేందుకు వచ్చిన విదేశీ ప్రతినిధులు పాల్గొన్నారు.

