Sridhar babu: గచ్చిబౌలి భూముల వివాదంపై ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ చేసిన పోస్టు నేపథ్యంలో, ఆమెపై పోలీసులు ఏఐ ద్వారా రూపొందించిన ఫొటోను షేర్ చేసినందుకు నోటీసులు జారీ చేశారు. దీనిపై స్పందించిన తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు, చట్టం ప్రకారమే ప్రభుత్వ చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.
గచ్చిబౌలి భూముల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను కచ్చితంగా పాటిస్తామని మంత్రి తెలిపారు. ఈ భూములు ప్రభుత్వానికి చెందినవేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని గుర్తు చేశారు. ఫేక్ వీడియోలు, ఎడిట్ చేసిన ఫొటోలు వంటి అంశాలు సమాజంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ భూముల అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్నందున, దాని గురించి మించి మాట్లాడలేమన్నారు.
నెమళ్లు జనావాసాల్లోకి రావడం సహజమేనని ఆయన పేర్కొన్నారు. అయితే, ఈ వివాదాన్ని పొడిగించేందుకు, తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంలో బీజేపీ నాయకులు చెప్తున్న తప్పుడు సమాచారం ఆధారంగానే ప్రధాని నరేంద్ర మోదీ ఈ అంశంపై మాట్లాడినట్లు మంత్రి ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరం చేయాలని బీజేపీ, బీఆర్ఎస్ కలిసి కుట్రలు చేస్తున్నట్టు అనుమానం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి బలమైన మెజారిటీ ఉందని, అది కూలిపోయే ప్రభుత్వం కాదని స్పష్టం చేశారు.