PM Narendra Modi:వచ్చే నెలలో (మే) 9వ తేదీన రష్యాలో జరిగే 80వ విక్టరీ వేడుకలకు రావాల్సిందిగా భారత ప్రధాని నరేంద్ర మోదీకి రష్యా ప్రభుత్వం ఆహ్వానం పలికింది. రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీపై విజయం సాధించడంపై ప్రతి ఏటా రష్యాలో మే 9న విక్టరీ వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. మాస్కో ఆహ్వానంపై త్వరలో ప్రకటన వెలువడుతుందని విదేశాంగ శాఖ ప్రకటించింది. భారత్ సహా వివిధ దేశాల అధినేతలకు రష్యా ఆహ్వానం పలికింది.
PM Narendra Modi:ఈ పరిణామంతో అంతర్జాతీయంగా ప్రాధాన్యం సంతరించుకోనున్నది. భారత ప్రధానిని ఆహ్వానించిన రష్యా మరో కీలక పరిణామానికి పావులు కదిపినట్టు అయింది. ప్రతి ఏటా ఈ వేడుకకు రష్యాకు కీలక భాగస్వాములు, మిత్ర దేశాధినేతలు హాజరవుతారు. అందుకే భారత్ తమకు మిత్రదేశమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చెప్పకనే చెప్పినట్టయింది.
PM Narendra Modi:భారత్, రష్యాల మధ్య దశాబ్దాలుగా రక్షణ, ఇంధన రంగాల నుంచి బలమైన సహకారం కొనసాగుతుంది. మారుతున్న ప్రపంచ సమీకరణాల నేపథ్యంలో కూడా భారత్‌ను నమ్మకమైన వ్యూహాత్మక భాగస్వామిగానే రష్యా పరగణిస్తుంది. దానిలో భాగంగా ఈ వేడుకలకు పిలుపు వచ్చిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
PM Narendra Modi:ఇదిలా ఉంటే ఉక్రెయిన్‌తో రష్యా ఘర్షణ విషయంలో కొంత సందిగ్ధం నెలకొనే అవకాశం ఉన్నదని విశ్లేషకులు అంటున్నారు. ఈ ఘర్షణ విషయంలో భారత్ తటస్థ వైఖరిని అవలంబిస్తూ రష్యాపై బహిరంగ విమర్శలు చేయకుండా సంయమనం పాటిస్తూ వచ్చింది. ఒకవేళ రష్యా వేడుకలకు హాజరైతే అది పశ్చిమ దేశాలతో కొంత అనుమానాలు రేకెత్తే అవకాశం ఉన్నది.