Hyderabad: హైదరాబాద్ మహానగరంలో వీధుల్లోనే కాదు.. అంతస్థుల పైన కూడా కుక్కలున్నాయ్ జాగ్రత్త అని మసలుకోవాలన్నమాట. ఇటీవల మనషులతో కంటే కుక్కలతో కొందరు కాలక్షేపం చేస్తూ సరదా తీర్చుకుంటున్నారు. అందుకే హైదరాబాద్‌లో ఏ వీధిలో చూసినా వీధి కుక్కలు ఒకవైపు, మనుషులతో గొలుసులున్న పెంపుడు కుక్కలు మరోవైపు తిరుగుతుంటాయి. ఆ రోడ్డు వెంట వెళ్లేవారు బిక్కుబిక్కుమంటూ వెళ్లాల్సిన పరిస్థితులు దాపురిస్తాయి.
Hyderabad: ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే.. ఇది వీధి కుక్కనో, పెంపుడు కుక్కనో తెలియదు కానీ, మూడో అంతస్థులో.. ఓ యువకుడి ప్రాణం తీసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెనాలి ప్రాంతానికి చెందిన ఉదయ్ (23) హైదరాబాద్ చందానగర్‌లోని ఓ హోటల్‌కు ఆదివారం తన స్నేహితులతో కలిసి వెళ్లాడు. మూడో అంతస్థు బాల్కనీలో ఉండగా, ఓ కుక్క పరిగెత్తుకుంటూ కరిచేందుకు ఉదయ్ వైపు దూసుకొచ్చింది. దీంతో పరుగుతీశాడు.
Hyderabad: బాల్కనీలో ఎంతదూరం పరిగెత్తగలడు. ఆ కుక్క బారి నుంచి తప్పించుకునేందుకు అకస్మాత్తుగా ఏంచెయ్యాలో తోచక భయాందోళనతో కిటికీ నుంచి ఉదయ్ దూకేశాడు. మూడో అంతస్థు నుంచి కిందికి దూకడంతో తీవ్రగాయాలయ్యాయి. వెంటనే చికిత్స కోసం అదేరోజు రాత్రి ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ప్రాణాలిడిచాడని అక్కడి వైద్యులు తేల్చిచెప్పారు.
Hyderabad: ఆదివారం రాత్రి ఘటన జరిగితే, సోమవారం రాత్రి వరకు ఈ విషయాన్ని బయటకు పొక్కకుండా చేశారని ఆరోపణలు ఉన్నాయి. అటు హోటల్ సిబ్బంది కానీ, ఇటు పోలీసులు కానీ గోప్యంగా ఉంచారు. సీసీ టీవీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలు బయటపడ్డాయి. చూశారా! వీధుల్లో కుక్కల బెడదతో హడలెత్తిపోతున్న హైదరాబాదీ జనం, అంతస్థుల్లో ఉండి ప్రాణాలు తీస్తున్నాయని ఆందోళన చెందుతున్నారు.