Manchu Manoj: టాలీవుడ్‌లో మరోసారి మంచు ఫ్యామిలీ వివాదం తీవ్రరూపం దాల్చింది. కొన్ని నెలలుగా సద్దుమణిగిన అనుమానాలు మళ్లీ ముంచుకొస్తున్నాయి. ప్రముఖ నటుడు మంచు మోహన్‌బాబు కుమారుడు మంచు మనోజ్ ఇటీవల తన కారు దొంగతనంపై నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ఈ కుటుంబ కలహం మళ్లీ ముదిరింది.
కారు చోరీ కేసు: ఫిర్యాదు వివరాలు
మనోజ్ తరఫున ఆయన డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను చెప్పిన వివరాల ప్రకారం, ఏప్రిల్ 1వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో నార్సింగిలోని ముప్ప విల్లాస్ ప్రాంతంలోని ఇంటి ముందు పార్క్ చేసి ఉంచిన కారును గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. భద్రతా సిబ్బంది ఆ కారు మనోజ్ నడుపుతున్నాడు అనుకోని గేట్‌లు తెరిచినట్లు తెలుస్తోంది. కానీ నడుపుతుంది మనోజ్ కాదు అని తెలుసుకున్న వెంటనే వాళ్లను బైక్‌పై ఫాలో కావడానికి ప్రయత్నించినా, వారు వేగంగా పారిపోయారని చెప్పాడు.
ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసిన మనోజ్
ఈ ఘటనపై ఒక టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంచు మనోజ్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. తన కుమార్తె పుట్టిన రోజు సందర్భంగా రాజస్థాన్‌లోని జయపుర వెళ్లిన సమయంలో, తన సోదరుడు మంచు విష్ణు సుమారు 150 మందితో కలిసి జల్‌పల్లిలోని ఇంట్లోకి చొరబడి, పలు విలువైన వస్తువులను ధ్వంసం చేశారని ఆరోపించారు. నగల పెట్టె పగలగొట్టడం, భార్య, పిల్లల వస్తువులను ధ్వంసం చేయడం, తన కారు మరియు భార్య కార్లను టోయింగ్ వాహనంతో బయట రోడ్డు మీద వదలడం వంటి సంఘటనలు జరిగినట్టు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Manchu Family: అంతులేని కథ.. మళ్ళీ పోలీస్ స్టేషన్ కెక్కిన మంచు ఫ్యామిలీ పంచాయతీ!
అంతేకాదు, తన కారును విష్ణు ఇంట్లో పార్క్ చేశారని, కారు రికవరీ కోసం వెళ్లినప్పుడు మాదాపూర్‌కు తరలించారని తెలిపారు. పోలీసులు విచారణ చేపట్టిన సమయంలో కూడా సాక్షులపై దాడికి ప్రయత్నించారని ఆరోపించారు.
మోహన్‌బాబు ఇంటి వద్ద ఆందోళన
ఈ ఘటనలపై నిరసనగా మంచు మనోజ్ ఏప్రిల్ 9న జల్‌పల్లిలోని మోహన్‌బాబు ఇంటి వద్ద ధర్నాకు దిగారు. తన ఫిర్యాదుపై స్పందించలేదని, తండ్రి మోహన్‌బాబుతో మాట్లాడేందుకు ప్రయత్నించినా ఆయన స్పందించకపోవడంతో, ఇంటి గేటు వద్ద నిరసన చేపట్టినట్టు చెప్పారు.

Beta feature

