YS Jagan: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ శైలి కొందరికి విచిత్రంగానూ, వివాదాస్పదంగానూ కనిపిస్తూ ఉంటుంది. మరికొందరికి ఆయన చేసే వాగ్దానాలు, వేసే వ్యూహాలు అర్థం కాని పజిల్ లాంటివి. “మూడేళ్లు ఆగండి, నేను ముఖ్యమంత్రి అవుతా” అన్న డైలాగ్‌ని ఆయన తాజా పులివెందుల పర్యటనలో రిపీట్ మోడ్‌లో వినిపించారు. ప్రతిపక్షహోదా కూడా లేకుండా 11 సీట్లకే పరిమితం అయినా.. మళ్లీ ముఖ్యమంత్రిని అవుతానన్న ఆత్మవిశ్వాసం, ఆశావాదం ఉండటం మంచిదే. “మూడేళ్లలో ఎన్నికలు వస్తాయి” అనడం ద్వారా, తన పార్టీ కార్యకర్తలను, అభిమానులను ఓపికగా ఉండమని, తాను తిరిగి అధికారంలోకి వస్తానని సంకేతం ఇస్తున్నారు జగన్‌మోహన్‌రెడ్డి.
కానీ కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది కూడా కాకముందే “మూడేళ్లలో ముఖ్యమంత్రి అవుతా” అనడం అతిశయోక్తిగా, వాస్తవికతకు దూరంగా ఉందంటున్నారు రాజకీయ పరిశీలకులు. పోలీసు కేసులు, కార్యకర్తల ఫిర్యాదులు, రైతుల సమస్యలు.. ఇలా అన్నింటికీ “మూడేళ్లు ఆగు” అనే సమాధానమే చెప్పడం అంటే… ఆయన వద్ద ప్రస్తుతానికి ఆచరణీయమైన పరిష్కార మార్గాలు ఏమీ లేవా? అన్న సందేహం అటు కార్యకర్తల్లో, ఇటు జగన్‌నే నమ్ముకున్న వైసీపీ అభిమానుల్లో కలుగుతోంది.
YS Jagan: జగన్ మాటల్లో ఆచరణీయత కంటే ఊహాగానాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. “ముఖ్యమంత్రి అవుతా” అని చెప్పడం సులభమే… కానీ ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీని వీడుతున్న నాయకత్వం స్థానంలో కొత్త నాయకులతో భర్తీ చేయడం, పార్టీని బలోపేతం చేయడం, బలమైన కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కోవడం అంత సులభం కాదంటున్నారు. ఇలాంటి డైలాగులు కార్యకర్తలకు తాత్కాలిక ఉత్సాహం ఇచ్చినా, దీర్ఘకాలంలో ఫలితాలు లేకపోతే.. అధినేతపై విశ్వసనీయత తగ్గే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇక పోలీసులపై జగన్ తరచూ చేస్తున్న వ్యాఖ్యలు పార్టీకి నష్టం చేస్తాయని కొందరు విజ్ఞత కలిగిన వైసీపీ నేతల్లో ఆందోళన ఉన్నా… జగన్ తన సహజ స్వభావాన్ని మార్చుకోలేక పోతున్నారన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
Also Read: Kodali Nani: ఏపీ మాజీ మంత్రి కొడాలి నానికి గుండెపోటు
పోలీసు వ్యవస్థ అనేది ఒక క్రమశిక్షణ బద్ధమైన సంస్థ. దానికి స్వతంత్రంగా పనిచేసే అధికారం ఉంది. ఒక డీఎస్పీతో కార్యకర్తకు సెల్యూట్ చేయిస్తానని చెప్పడం అంటే… అది పోలీసు వ్యవస్థలోని హుందాతనాన్ని, స్వాభిమానాన్ని దెబ్బతీసే చర్య అవుతుంది. తన కార్యకర్తకు భరోసా ఇవ్వడానికి.. భుజం తట్టి అండగా ఉంటానని చెప్పొచ్చు. న్యాయ పరమైన సహాయ సహకారం అందించొచ్చు. అది మానేసి.. మూడేళ్లు ఆగు.. ఆ డీఎస్పీ పని పడతా అనడం.. నిజానికి ఆ కార్యకర్తకు కూడా వాస్తవికంగా ఉపశమనాన్ని ఇవ్వదు.
YS Jagan: “డీఎస్పీతో సెల్యూట్ కొట్టిస్తా” అనడం ద్వారా, పోలీసులను తన చెప్పు చేతల్లో ఆడించగలనని జగన్ సంకేతం ఇస్తున్నట్లే లెక్క. జగన్ మాటల్లో తరచూ ఈ ఆధిపత్య ధోరణి కనిపిస్తుంది. పోలీసులను అవమానించేలా మాట్లాడటం ఆయనకు కొత్త కాదు. అధికారంలో ఉన్నప్పుడు వారిని తన అజెండాకు అనుగుణంగా నడిపించాడనే విమర్శ ఉంది. ఇప్పుడు అధికారం లేనప్పుడు వారిని చులకన భావంతో చూసే ధోరణి కనిపిస్తోంది. ఇలాంటి వ్యక్తి మళ్లీ ముఖ్యమంత్రి అయితే పోలీసు వ్యవస్థని ఎంత దారుణంగా దుర్వినియోగం చేస్తాడో అన్న భయాలు సామాన్య ప్రజల్లోనే వ్యక్తం అవుతున్న పరిస్థితి.