Shihan Hussaini: ప్రముఖ కోలీవుడ్ నటుడు షిహాన్ హుసైని కన్నుమూశారు. ఆయన వయస్సు 60 సంవత్సరాలు. గత కొంతకాలంగా బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న హుసైని, చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ విషాదకర వార్తను ఆయన కుటుంబ సభ్యులు సామాజిక మాధ్యమాల ద్వారా ధ్రువీకరించారు. హుసైని మరణంపై సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
సినీ ప్రయాణం
షిహాన్ హుసైని 1986లో విడుదలైన పున్నగై మన్నన్ చిత్రంతో కోలీవుడ్ చిత్రసీమలో అడుగు పెట్టారు. తన కెరీర్‌లో పలు చిత్రాల్లో నటించిన ఆయన, విజయ్ హీరోగా నటించిన బద్రి సినిమా ద్వారా విశేషమైన గుర్తింపు పొందారు. నటన మాత్రమే కాకుండా, హుసైని మార్షల్ ఆర్ట్స్, కరాటే, కిక్ బాక్సింగ్‌లోనూ ప్రవేశం కలిగి ఉన్నారు.
ఇది కూడా చదవండి: Chhaava in Parliament: పార్లమెంట్‌లో ‘ఛావా’ మూవి స్పెషల్ స్క్రీనింగ్?
మార్షల్ ఆర్ట్స్‌లో ప్రావీణ్యం
సినీ రంగంతో పాటు, హుసైని మార్షల్ ఆర్ట్స్‌లో కూడా పేరుపొందారు. ముఖ్యంగా ఏపీ ఉపముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్‌కు మార్షల్ ఆర్ట్స్, కరాటే, కిక్ బాక్సింగ్‌లో శిక్షణ అందించిన గురువుగా గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాకుండా, ఆయన ఆర్చరీ కోచ్‌గా కూడా 400 మందికి పైగా విద్యార్థులను శిక్షణ ఇచ్చారు.
హుసైని మృతి తమిళ సినీ పరిశ్రమకు తీరని లోటుగా చెప్పొచ్చు. ఆయన మరణ వార్త విన్న సినీ ప్రముఖులు, శిష్యులు, అభిమానులు సంతాపం తెలియజేస్తున్నారు.