Malreddy Ranga Reddy: రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి సాధించడమే లక్ష్యమని, అవసరమైతే తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి తెలిపారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు చల్ల నరసింహారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో మల్‌రెడ్డి రంగారెడ్డి పాల్గొని ప్రసంగించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్నప్పటికీ, కార్యకర్తలు తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నారని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఎంతో కష్టపడ్డ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు రాకపోవడం వల్ల నిరాశ నెలకొందని అన్నారు. రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి దక్కకపోవడం వల్ల నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆందోళన చెందుతున్నారని, మంత్రి లేకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపారు.
హైదరాబాద్‌కు కీలకమైన రంగారెడ్డి జిల్లాలో ఇప్పటివరకు మంత్రి పదవి లేకపోవడం బాధాకరమని మల్‌రెడ్డి వ్యాఖ్యానించారు. జిల్లాలో ఉన్న సమస్యల పరిష్కారానికి మంత్రిని ఆశ్రయించాలని చూస్తే మంత్రి పదవి లేకపోవడం నిరుత్సాహానికి దారితీసిందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాకు మంత్రి పదవి కోసం అవసరమైతే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమని స్పష్టంచేశారు.
రంగారెడ్డి జిల్లాలో ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యేగా తాను గెలిచినప్పటికీ తనకు మంత్రి పదవి దక్కకపోవడం ఆశ్చర్యకరమని వ్యాఖ్యానించారు. అగ్రవర్ణాలకు మంత్రి పదవి రాకపోతే, తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, మరొకరిని పోటీ చేయించి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఒక్క కార్యకర్తకు అండగా నిలిచి, సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలుగా గెలిపించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఈ అంశంపై వెంటనే దృష్టి సారించి, రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి కేటాయించాలని ఆయన డిమాండ్చేశారు.