Electric Bike: సాంకేతికత అభివృద్ధి మన జీవితాలను సులభతరం చేస్తూనే, కొన్నిసార్లు ప్రాణాపాయకర పరిణామాలకు దారితీస్తోంది. తాజాగా చెన్నైలో చోటుచేసుకున్న దారుణ ఘటన అందరినీ కలచివేసింది. ఓ కుటుంబం ఎలక్ట్రిక్ బైక్ కారణంగా తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
ఛార్జింగ్ పెట్టిన బైక్ మంటల్లో
31 ఏళ్ల గౌతమన్ ఎలక్ట్రిక్ మోటార్ మెకానిక్‌గా పనిచేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. భార్య మంజు, తొమ్మిది నెలల పాపతో కలిసి చెన్నై మధురవోయల్‌లో నివాసం ఉంటున్నాడు. ప్రతిరోజూ లాగే, శుక్రవారం రాత్రి కూడా తన ఎలక్ట్రిక్ బైక్‌ను పోర్టికోలో ఛార్జ్ పెట్టాడు. గేటుకు తాళం వేసి ఇంట్లోకి వెళ్లి పడుకున్నాడు.
ఇది కూడా చదవండి: IPL 2025: ఐపీఎల్‌లో ప్లేఆఫ్స్‌కు చేరుకునే నాలుగు జట్లు ఇవే..
కానీ తెల్లవారేసరికి భయానక ఘటన చోటు చేసుకుంది. ఛార్జింగ్‌లో ఉన్న బైక్ ఒక్కసారిగా మంటల్లో కాలిపోయింది. మంటలు పక్కనే ఉన్న ఇంటికి వ్యాపించడంతో గౌతమన్ మేల్కొని తన కూతురిని కాపాడేందుకు ప్రయత్నించాడు. ఆమెను పై అంతస్తుకు తీసుకెళ్లాలని చూసినా మంటలు విస్తరించడంతో తండ్రీకూతుళ్లు ఆ అగ్నికి బలయ్యారు. ఈ ప్రమాదంలో భార్య మంజు కూడా తీవ్రంగా గాయపడింది.
విషాదఛాయలు
తండ్రీకూతుళ్ల మృతి ఆ ఇంటితో పాటు పరిసర ప్రాంతాల్లోనూ విషాదాన్ని నింపింది. స్థానికుల సహాయంతో మంజును ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది. ఈ ఘటనతో ఎలక్ట్రిక్ బైక్‌ల భద్రతపై మరోసారి చర్చ మొదలైంది.
ఎలక్ట్రిక్ బైక్‌ల భద్రత
ఈ తరహా ప్రమాదాలు ఇటీవల తరచుగా జరుగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎలక్ట్రిక్ బైక్‌లను రాత్రిపూట ఛార్జింగ్‌కు పెట్టడం, తగిన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం ప్రమాదాలకు దారితీస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే, వినియోగదారులు మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.