Telangana: మీరు చూసింది నిజమే.. ఆ ఊరిలో ఆడపిల్ల పుడితే రూ.5 వేలు ఇస్తానంటున్నది. ఎవరైనా చనిపోతే ఆ కుటుంబానికి రూ.20 వేలు సాయం చేస్తానంటున్నది. ఇవే కాదు, ఇంకా చాంతాడంత జాబితానే ఉన్నది. ఇవన్నీ ఇస్తానంటున్న ఆ మహిళ ఎవరు? ఏమిటి? ఎందుకు? అని తెలుసుకోవాలని ఉందా! చెప్తా రండి.
Telangana: తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం ఊరూరా సందడి నెలకొన్నది. ఆశావహులు అందరినీ కలుపుకొని పోతున్నారు. దావత్‌లతో మచ్చిక చేసుకుంటున్నారు.. అయితే యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఓ ఆశావహురాలు ఏకంగా ఎజెండానే రూపకల్పన చేసింది. ఇంటింటికీ తన ఎజెండా లక్ష్యాలను ఏకరువు పెడుతున్నది. తనను గెలిపిస్తే తాను చేపట్టే పథకాలు, సంక్షేమ కార్యక్రమాల జాబితాను ఇంటింటికీ పంచుతున్నది.
Telangana: యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన కొడారి లతా మల్లేశ్ తాజాగా విడుదల చేసిన పంచాయతీ ఎన్నికల మ్యానిఫెస్టో వైరల్‌గా మారింది. దసరా, దీపావళి శుభాకాంక్షల పేరిట రూపొందించిన ఆ మ్యానిఫెస్టోలో రాబోయే సర్పంచ్ ఎన్నికలకు మ్యానిఫెస్టో.. అని ఉన్నది. దానిపై తనను గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా నిలబెడితే గ్రామస్థులకు చేయాల్సిన పనుల జాబితాను వరుసగా పేర్కొన్నారు. ఈ జాబితాతో కూడిన బ్రోచర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె ఇచ్చిన మ్యానిఫెస్టోలోని అంశాలు ఈ కిందివిధంగా ఉన్నాయి.
1) గ్రామ పంచాయతీ పరధిలో ప్రజలందరికీ ఉచితంగా మంచినీటి సరఫరా (ఫిల్టర్ నీరు) సౌకర్యం
2) గ్రామంలో కులాలకు అతీతంగా చనిపోయిన వ్యక్తి దహన సంస్కారాల కోసం అవసరమయ్యే ఫ్రీజర్, వైకుంఠరథం, వాటర్ ట్యాంకర్ ఉచితం
3) గ్రామంలో ప్రతి ఇంటికి ఇంటి పన్ను ఉచితం
4) గ్రామంలో ఎవరైనా చనిపోతే కులాలకు అతీతంగా మృతుచెందిన వారి కుటుంబానికి రూ.20 వేల ఆర్థికసాయం
5) గ్రామంలో ఏ కుటుంబంలోనైనా బంగారు తల్లి(ఆడపిల్ల) జన్మిస్తే ఆ ఇంటికి రూ.5,000 ఆర్థికసాయం
6) గ్రామంలో ఏ కుటుంబంలోనైనా ఆడపిల్ల పెళ్లికి ఆడపడుచు కానుక
7) గ్రామంలో వృద్ధాప్యంలో ఉన్న ఒంటరి మహిళలు, పురుషుల కోసం ఆసరా నిలయం (నివాస వసతి గృహం) ఏర్పాటు
8) గ్రామంలోని ఎస్సీ, బీసీ కుటుంబాల కోసం వేర్వేరుగా కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం
9) గ్రామంలోని నిరుద్యోగ ఆడపడుచుల కోసం నిరంతర 30 కుట్టుమిషన్లతో టైలరింగ్ ట్రైనింగ్ సెంటర్ ప్రారంభం
10) గ్రామంలోని పాఠశాలల్లో సమయానుగుణంగా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, సాంకేతిక పరిజ్ఞానం కోసం ఆధునిక పరికరాలు ఏర్పాటు
11) గ్రామంలోని ముదిరాజు కుటుంబాలకు చెరువుల్లో చేపలు పెంచుకొనుటకు పూర్తి అధికారం కల్పించుట
12) గ్రామంలోని ఆలయాలు, బతుకమ్మలు, బోనాల వేడుకల సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించుట

