Betting APPs Case:బెట్టింగ్ యాప్స్ కేసు కీలక మలుపు తిరిగింది. నిన్న మొన్నటి వరకూ యూట్యూబర్స్, చిన్న స్టార్లపై నమోదైన కేసులు ఇప్పుడు బిగ్గెస్ట్ స్టార్లపై పోలీసుల నజర్ పడింది. పలువురు ప్రముఖ నటీనటులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. దీంతో ఇంకా ఎంత మంది ఉన్నారన్న అంశం చర్చనీయాంశంగా మారింది. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 25 మంది సెలబ్రిటీలపై ఇప్పటి వరకు పోలీస్ స్టేషన్లలో ఎఫ్ఐఆర్ నమోదైంది.
Betting APPs Case:ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ మూలంగా ఎందరో వారి సబ్స్క్రైబర్లు నమ్మి ఆర్థికంగా నష్టాలపాలయ్యారు. కొందరు మనస్తాపంతో తనువులు చాలించారు. ఇంకెన్నో కుటుంబాలు విచ్ఛిన్నమయ్యాయి. ఇలాంటి దుర్గతికి ఈ బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన సెలబ్రిటీలను బాధ్యులుగా చేస్తూ ఇటీవల పోలీసులు ప్రత్యేక దర్యాప్తును ముమ్మరం చేశారు. దీంతో గతంలో వారు చేసిన బెట్టింగ్ యాప్‌ల ప్రమోషనపై ఆరా తీస్తున్నారు.
Betting APPs Case:ఈ దశలో టాలీవుడ్లో బిగ్గెస్ట్ స్టార్లపై పోలీసులు కేసులు నమోదు చేయడం సంచలనంగా మారింది. ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ల ఆరోపణలతో ప్రముఖ నటులు రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, ప్రకాశ్ రాజ్, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్ సహా 25 మంది సెలబ్రిటీలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు మియాపూర్ పోలీసులు తెలిపారు.
Betting APPs Case:పైవారితోపాటు శోభాశెట్టి, అమృతచౌదరి, నాయని పావని, పండు, నేహా పఠాన్, పద్మావతి, ఇమ్రాన్‌ఖాన్, హర్షసాయి, బయ్యా సన్నీయాదవ్, శ్యామల, విష్ణు ప్రియ, టేస్టీ తేజ, రీతూ చౌదరిపై ఇప్పటికే పోలీసులు కేసులు నమోదు చేశారు. బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ గురించి పోలీసులు వారి ద్వారా ఆరా తీస్తున్నారు. బెట్టింగ్ యాప్‌ల ప్రతినిధులు మిమ్మల్ని ఎలా సంప్రదిస్తారు? ఎంత ముట్టజెప్తారు? అన్న విషయాలను రాబడుతున్నారు.
Betting APPs Case:ఇదిలా ఉండగా బెట్టింగ్ యాప్‌ల సొమ్ము హవాలా రూపంలో మనీలాండరింగ్ జరిగిందన్న సమాచారం మేరకు బెట్టింగ్ యాప్స్ కేసులోకి ఈడీ కలుగజేసుకున్నది. దీంతో బెట్టింగ్ ప్రమోషన్ చేసిన వారిలో ఆందోళన నెలకొన్నది. ఇప్పటికే పలువురు ఇన్ఫ్లుయెన్సర్లు తమ ఫోన్లను స్విఛ్ ఆఫ్ చేసి దూరంగా వెళ్లిపోయారు. కొందరు ప్రాయశ్చిత్త వీడియోలు పెడుతూ, తమకేమీ తెలియదన్నట్టుగా చెప్పేస్తున్నారు. ఈ మేరకు వారందిరినీ రప్పించేందుకు స్పెషల్ పోలీస్ టీంలు రంగంలోకి దిగాయి.