Hyderabad: పల్లా అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తుర్రు..

Hyderabad: తెలంగాణ శాసనసభలో శనివారం అధికార పార్టీ, ప్రతిపక్ష మధ్య వాడివేడి చర్చ జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రతిపక్ష నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్నికల హామీలను కేవలం 10 శాతం మాత్రమే అమలు చేస్తున్నారని, మిగతా హామీలను విస్మరించారని ఆరోపించారు. గవర్నర్ ప్రసంగంపై కూడా పల్లా విమర్శలు చేస్తూ, దానికి దశ, దిశలేదని అన్నారు.

అలాగే, తెలంగాణ ప్రభుత్వం అహంకారపూరితంగా వ్యవహరిస్తోందని, జర్నలిస్టులపై కేసులు పెట్టి వేధిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అస్తిత్వానికి భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తోందని పల్లా తీవ్రంగా మండిపడ్డారు.

ఈ ఆరోపణలపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కౌంటర్ ఇస్తూ, పల్లా రాజేశ్వర్ రెడ్డి విద్యాసంస్థలను నడుపుతున్న క్రమంలో ప్రభుత్వం కోసం మంచి సూచనలు చేస్తారని భావించామని, కానీ ఆయన మాత్రం అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ చర్యలపై విమర్శలు చేసే ముందు వాస్తవాలను తెలుసుకోవాలని హితవు పలికారు.

భట్టి విక్రమార్క మాట్లాడుతూ, ఉస్మానియా యూనివర్సిటీకి తొలిసారి దళిత వీసీని నియమించామని, మహిళా యూనివర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెట్టామని గుర్తుచేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో భాగమైన పల్లా రాజేశ్వర్ రెడ్డి, మహిళా యూనివర్సిటీని సందర్శించారా అని నిలదీశారు. విద్యాశాఖపై సమీక్ష జరపడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమయం లేదని పల్లా చేసిన వ్యాఖ్యలను ఖండించారు. తమ ప్రభుత్వం విద్యాశాఖలో భారీగా ఉద్యోగాలను కల్పించిందని స్పష్టం చేశారు.

భట్టి విక్రమార్క వ్యాఖ్యలపై ప్రతిస్పందించిన పల్లా రాజేశ్వర్ రెడ్డి, 2014 నుంచి 2023 వరకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం 30 మందికి పైగా వీసీలను నియమించిందని తెలిపారు. విద్యా వ్యవస్థపై ప్రభుత్వం దృష్టిపెడితే, రాష్ట్రవ్యాప్తంగా వెయ్యికి పైగా పాఠశాలలు ఎందుకు మూతపడ్డాయని ప్రశ్నించారు. దాదాపు 2 లక్షల మంది విద్యార్థులు ఎందుకు బడి మానేశారని నిలదీశారు. పేర్లు మార్చడం వంటి చిన్న విషయాలను పెద్దగా చెప్పుకోవడం మానుకుని, విద్యాశాఖలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించారు.

అంతేకాక, పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినట్లుగానే కేఆర్‌ఎంబీ (కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డ్) నడుస్తోందని విమర్శించారు. తెలంగాణకు రావాల్సిన హక్కుసంబంధిత నీటి వాటాపై పోరాడాలని సీఎం రేవంత్ రెడ్డినికోరారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *