Team Jagan VS Janasena: భారత క్రికెట్ జట్టు 12 ఏళ్ల తర్వాత ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకొని సత్తా చాటింది. టీమిండియా మైదానంలో అద్భుత ప్రదర్శన కనబరిచింది. ఆటగాళ్ల కసరత్తు, ప్రణాళిక, కట్టుదిట్టమైన ప్రాతినిధ్యం ఈ విజయానికి కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇంటా బయటా అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో పొలిటికల్ గేమ్ మొదలైంది. కప్పు కొట్టిన భారత ఆటగాళ్లు 11 మందే.. మేమూ 11 మందే… 11కు ఉన్న వ్యాల్యూ అలాంటిదంటూ వైసీపీ చెప్పుకుంటోంది. ఇక జనసేన నేత నాగబాబు సైతం భారత విజయాన్ని, జనసేన జర్నీని కంపేర్ చేయడం.. పొలిటికల్ గేమ్‌ని మరింత ఇంట్రస్టింగ్‌గా మార్చేసింది.
గత ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 సీట్లే వచ్చాయి. వైనాట్ 175 అన్న దగ్గర నుంచి, 151 సీట్లున్న వైసీపీ కాస్తా 11కి పడిపోవడం ఆ పార్టీ నేతల్ని ఒకరకంగా తలెత్తుకోనీయకుండా చేసింది. అయితే ఇప్పుడిప్పుడే వైసీపీ ఆ 11 నంబర్‌ని ఓన్ చేసుకుంటోంది. 11 మంది వైసీపీ సింహాలని, అసెంబ్లీని గడగడలాడించేందుకు, కూటమిని కడిగిపారేసేందుకు ఆ 11 మంది చాలని.. వైసీపీ సోషల్‌మీడియా ఉద్యోగులు విపరీతంగా ఎలివేషన్లు ఇస్తున్నారు. అయితే జగన్ మాత్రం అసెంబ్లీ లేదు.. ఏం లేదు.. సోషల్ మీడియాలో ప్రశ్నించండి.. అంటూ వారి ఆశలపై నీళ్లు జల్లారు. ఈ క్రమంలోనే వైసీపీని లేపేందుకు ఆ పార్టీ సోషల్‌మీడియా ఐసీసీ చాంపియన్ ట్రోఫీని ఫుల్లుగా వాడుకుంటోంది.
ఎవరితో పొత్తు లేకుండానే… 11 మంది భారత ప్లేయర్లు నిజాయితీగా ఆడి.. ఇండియాలోని 100 కోట్ల మందిని విజేతలుగా నిలిపారంటూ.. వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఓ ట్వీట్ చేశారు. దీన్ని సేవ్ చేసి పెట్టుకోవాలని చెప్తూ.. నాలుగేళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ఏదో రిపీట్ అవుతుందంటూ చెప్పుకొచ్చారు. అయితే మరోవైపు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు.. భారత్ ఐసీసీ చాంపియన్ ట్రోపీని గెలవడంపై… ఓ ఆసక్తికరమైన పోలికను ప్రస్తావించారు. టీమిండియా ఒక్కసారి కూడా టాస్ గెలుచుకోకుండా ట్రోఫీ గెలిచిందనీ, జనసేన పార్టీ ఒక్క ఎమ్మెల్యే కూడా లేకుండా 12 ఏళ్ల తర్వాత 100 శాతం స్ట్రయిక్ రేట్‌తో విజయం సాధించిందని పేర్కొన్నారు. గెలుపునకు అదృష్టంతో సంబంధం లేదని టీమిండియా నిరూపించిందన్నారు. జనసేన కూడా కేవలం కృషితో, అంకితభావంతో ప్రజల మద్దతును పొందిందనీ… ప్రణాళిక, ఐకమత్యం, కూర్పు, కసరత్తు.. ఇవి ఉండాలే కానీ అదృష్టం ఒక్కటే విజయాల్ని తేల్చదని తన ఎక్స్ ఖాతాలో రాశారు నాగబాబు.
Also Read: Odisha: ఒడిశా అసెంబ్లీలో బాహాబాహీ.. తోపులాట..
అయితే నాగబాబు ట్వీట్‌కు ఎక్స్‌లోనే కౌంటర్ ఇచ్చారు మరో వైసీపీ నేత కారుమూరు వెంకటరెడ్డి. మెగా బ్రదర్ నాగబాబు అడ్డదారిలో సైకిల్ తొక్కి ఎమ్మెల్సీ అవుతున్నారనీ, జనసేన 16 ఏళ్ల నుండి 10 జెండాలు మోసి, ఈవీఎంల ద్వారా అడ్డదారిలో అధికారంలోకి వచ్చిందనీ, నిజాయితీగా పోరాడి గెలిచిన ఇండియాతో పోల్చుకుని దేశం పరువు తీయొద్దని నాగబాబుకు ట్వీట్‌కు కౌంటర్ రాసుకొచ్చారు కారుమూరి. జనసేన విజయాన్ని ఏ మాత్రం అంగీకరించే పరిస్థితిలో వైసీపీ లేదని కారుమూరి ట్వీట్ చూస్తుంటే అర్థమవుతోంది. గత ఎన్నికల్లో నాగబాబు కూటమి కోసం ఎంపీ టిక్కెట్ వదులుకున్నారు. కూటమి గెలుపుకు కష్టపడ్డారు. ఇప్పుడు దర్జాగా ఎమ్మెల్సీ తీసుకుంటున్నారు. ఇక జనసేన జర్నీ మొదలై ఈ మార్చి 14కు 11 ఏళ్లు పూర్తవుతుంది. కారుమూరి 16 ఏళ్లు అంటూ రాసుకొచ్చారు. ఇక జనసేన గెలుపు ఈవీఎంల వల్లే జరిగిందంటూ… సున్నా మార్కులు పడే విమర్శలు చేశారు.
టీమిండియా గెలుపు ప్రపంచవ్యాప్తంగా భారతీయులను ఆనందింపజేసినట్లే, జనసేన పార్టీ విజయంతో ఆ పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. క్రికెట్‌లో మైదానంలో క్రీడాకారులు చేసిన కృషికి ప్రాముఖ్యత ఉన్నట్లే, రాజకీయాల్లో ప్రజల నమ్మకాన్ని పొందటానికి కష్టపడి పనిచేయడం అత్యంత అవసరం. ఇదే విషయాన్ని నాగబాబు తన ట్వీట్ ద్వారా తెలియజేశారు. నాగబాబు పోలికలో సమంజసం అనిపించే అంశాలు చాలా మందికి కనబడుతున్నాయి. కానీ వైసీపీ నేతలు, పేటీఎం బ్యాచ్‌లు చేస్తున్న పోలికే ఎవ్వరికీ అర్థం కావడం లేదు. టీమ్ ఇండియా ప్లేయర్లు గ్రౌండ్‌లో దిగి ఆడటం వల్లే కదా కప్పు గెలిచారు. కానీ వైసీపీ ప్లేయర్లు గ్రౌండ్‌లో… అంటే అసెంబ్లీలో అడుగుపెట్టేందుకే భయపడుతున్నారు. గేమ్ ఆడకుండా ఇంట్లో కూర్చున్న వైసీపీ ఎమ్మెల్యేలకు, గ్రౌండ్‌లో చెమటలు చిందించి కప్పు కొట్టిన భారత ప్లేయర్లకు పోలిక ఎలా కుదిరిందో మరి? ఏది ఏమైనా… ఇప్పుడిప్పుడే 11 నంబర్‌ని వైసీపీ ఓన్ చేసుకుంటూ ఉండటం ఇక్కడ శుభ పరిణామం అనే చెప్పాలి. ఇదే స్ఫూర్తితో తమ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చి తేల్చుకోవాలని వైసీపీ అభిమానులు కోరుకుంటున్నారు.