Borugadda Anil: వివిధ కేసుల్లో జైలుకెళ్లి బెయిల్‌పై బయట ఉంటున్న రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్ తాజాగా విడుదల చేసిన వీడియో కలకలం రేపింది. ఇప్పటికే అతని కోసం వెతుకుతున్న పోలీసులు.. ఆ వీడియోలో చేసిన వ్యాఖ్యలపై సీరియస్‌గా ఉన్నారు. కోర్టును కూడా తప్పుదోవ పట్టించాడంటూ పోలీసులు కీలక ఆధారాలను సేకరించారు. కోర్టుకు తప్పుడు మెడికల్ సర్టిఫికెట్ సమర్పించినట్టు తేలిందని చెప్తున్నారు. చెన్నైలో తన తల్లికి ఆపరేషన్ చేయించానని చెప్తున్న విషయం కూడా ఫేక్ అని పోలీసుల విచారణలో తేలినట్టు సమాచారం.
Borugadda Anil: తన చెల్లెళ్లకు వివాహాలై వారు దూరంగా ఉంటున్నారని, తన తల్లి అనారోగ్యంతో ఉండగా, సర్జరీ చేయించాలంటూ బోరుగడ్డ అనిల్ జైలులో ఉండగానే బెయిల్ పిటిషన్ వేశాడు. ఈ సమయంలో సమర్పించిన మెడికల్ సర్టిఫికెట్ ఫోర్జరీ చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. దానిని దాచిపెట్టి వీడియోలో మొసలి కన్నీరు కార్చాడని అనంతపురం పోలీసులు ఆగ్రహంతో ఉన్నట్టు తెలిసింది. తనపై నమోదు చేసిన 111 సెక్షన్ వర్తించదని వీడియోలో పేర్కొనడంపైనా సీరియస్‌గా ఉన్నారు. తనను అనంతపురం పోలీసులు వేధింపులకు గురిచేశారని కూడా ఆ వీడియోలో పేర్కొనడంపైనా కలకలం రేగింది.
Borugadda Anil: ఇదిలా ఉండగా, తన తల్లి సర్జరీ ఉన్నదనే సాకుతో బోరుగడ్డ అనిల్‌కుమార్ పొందిన బెయిల్ పిటిషన్‌పై అనుమానంతో పోలీసులు అతని కోసం గాలింపు చేపడుతున్నారు. అతని ఇంటికి వెళ్లిన పోలీసులకు తాళమేసి కనిపించింది. నిఘా వేయగా, గత కొన్నాళ్లుగా ఆ ఇంటికి ఎవరూ రావడం లేదని తేలింది. చెన్నైలోని ఓ ఆసుపత్రిలో సర్జరీ చేయించాడన్న సమాచారంతో పోలీసులు అక్కడికీ వెళ్లగా ఆచూకీ దొరకలేదని తెలిసింది. ఆసుపత్రిలో అనిల్ తల్లి పేరు పేరుగల వారు ఇటీవల చేరలేదని, సీసీ కెమెరాల్లో కూడా అతను నమోదు కాలేదని తేలింది.
Borugadda Anil: ఈ దశలో బోరుగడ్డ అనిల్‌పై లుకౌట్ నోటీసులు కూడా జారీఅయ్యాయి. అతను హైదరాబాద్ నుంచే ఆ వీడియోను విడుదల చేసినట్టు పోలీసులు గుర్తించినట్టు సమాచారం. న్యాయస్థానాలపై నమ్మకం ఉన్నదని చెప్తూనే పోలీసులపై తీవ్ర మైన ఆరోపణలు చేయడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ దశలో బోరుగడ్డ అనిల్‌పై పెద్ద ఎత్తన విచారణ జరుగుతున్నట్టు తెలుస్తున్నది.
Borugadda Anil: బోరుగడ్డ అనిల్ విడుదలైన నాటి నుంచి ఎవరిని కలిశాడు? ఎక్కడెక్కడ తిరిగాడు? సోషల్ మీడియాలో విడుదల చేసిన వీడియోను ఎక్కడి నుంచి విడుదల చేశాడు? అన్న విషయాలపై ఏపీ పోలీసులు ఆధారాలను సేకరిస్తున్నారు. రాష్ట్రస్థాయి టెక్నికల్ బృందం అతని పూర్తి వివరాల సేకరణలో నిమగ్నమై ఉన్నట్టు తెలుస్తున్నది. బెయిల్‌పై విడుదలైన తర్వాత అతనికి వైసీపీ నేతలు ఆశ్రయమిచ్చినట్టు పోలీసుల దృష్టికి వచ్చినట్టు తెలిసింది. ఇప్పటికే అనిల్ బెయిల్ రద్దు చేయాలని కోర్టులో పోలీసులు పిటిషన్ కూడా వేశారు. ఫేక్ సర్టిఫికెట్‌పై పూర్తి ఆధారాలతో గుంటూరు పోలీసులు నివేదిక అందజేశారు.