Delimitation: గతంలో ఇద్దరు పిల్లలు చాలు.. ఒక్కరు ముద్దు అంటూ ప్రచారంతో హోరెత్తించిన రాజకీయ నాయకులు ఇప్పుడు పిల్లలని ఎక్కువగా కనండి అంటూ కొత్తరాగం మొదలు పెట్టారు.
తమిళనాడు ప్రజలు వీలైనంత త్వరగా పిల్లలను కనాలని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ విజ్ఞప్తి చేశారు. ఇంతకు ముందు పిల్లలను కనడం విషయంలో మీ సమయం బట్టి కనమని చెప్పేవారం. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. వెంటనే పిల్లల్ని కనాల్సిన అవసరం వచ్చింది. పెళ్లయిన జంటలు వెంటనే పిల్లలను కనకపోతే ఇబ్బందులు వస్తాయి. రాష్ట్ర్రంలో జనాభా ఆధారితంగా డీలిమిటేషన్ ప్రక్రియ ఉంటుంది. జనాభా తక్కువ ఉంటే లోక్‌సభ సీట్ల సంఖ్య తగ్గవచ్చు, దీనివలన రాజకీయ ప్రాధాన్యం రాష్ట్రానికి తగ్గిపోతుంది. తమిళనాడు గతంలో విజయవంతమైన కుటుంబ నియంత్రణ పాటించింది. అదే ఇప్పుడు హానికరంగా మారుతోంది అంటూ స్టాలిన్ ప్రజలకు చెప్పారు.
Delimitation: తమిళనాడు భవిష్యత్తుపై చర్చించడానికి మార్చి 5న స్టాలిన్ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అన్ని ప్రతిపక్ష పార్టీలు ఇందులో పాల్గోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై మనం ఐక్యంగా ఉండి మన హక్కులను కాపాడుకోవాలని అన్నారు. నాగపట్నం జిల్లా పార్టీ కార్యదర్శి వివాహ వార్షికోత్సవంలో పాల్గొనడానికి వచ్చిన స్టాలిన్ .. ఆ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఎక్కువ మంది పిల్లలను కనాలని విజ్ఞప్తి చేశారు.
Also Read: Chandrababu and Pawan Kalyan: సీఎం చంద్రబాబు – డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ.. అందుకోసమేనా?
కుటుంబ నియంత్రణ విధానం రాష్ట్రానికి నష్టాన్ని కలిగిస్తోంది
ఫిబ్రవరి 25న జరిగిన కేబినెట్ సమావేశం తర్వాత స్టాలిన్ మాట్లాడుతూ, తమిళనాడులో కుటుంబ నియంత్రణ విధానాన్ని విజయవంతంగా అమలు చేయడం వల్ల రాష్ట్రం ఇప్పుడు నష్టాల స్థితిలో ఉందని చెప్పారు. జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ అమలు చేస్తే, తమిళనాడు ఎనిమిది మంది ఎంపీలను కోల్పోతుంది. దీనివల్ల పార్లమెంటులో తమిళనాడు ప్రాతినిధ్యం తగ్గుతుందంటూ ఆయన చెప్పుకొచ్చారు.
డీలిమిటేషన్ అంటే ఏమిటి?
డీలిమిటేషన్ అంటే లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల సరిహద్దులను నిర్ణయించే ప్రక్రియ. డీలిమిటేషన్ కోసం ఒక కమిషన్ ఏర్పడుతుంది. గతంలో 1952, 1963, 1973, 2002 లలో కూడా కమిషన్లు ఏర్పాటు చేశారు.
లోక్‌సభ సీట్ల పునర్విభజన ప్రక్రియ 2026 నుండి ప్రారంభమవుతుంది. అటువంటి పరిస్థితిలో, 2029 లోక్‌సభ ఎన్నికల్లో దాదాపు 78 సీట్లు పెరిగే అవకాశం ఉంది. జనాభా ఆధారిత డీలిమిటేషన్‌ను దక్షిణాది రాష్ట్రాలు వ్యతిరేకించాయి. అందువల్ల, ప్రభుత్వం దామాషా డీలిమిటేషన్ వైపు వెళుతోంది. దీనిలో జనాభా సమతుల్యతను కాపాడుకోవడానికి ఒక ఫ్రేమ్ వర్క్ సిద్ధం చేస్తున్నారు.